రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సెర్ప్ సిబ్బందితో శనివారం ఆమె సమావేశమై కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు
పక్కాగా, పకడ్బందీగా కొనుగోళ్లు జరుపాలన్నారు.
భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 16 : ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 2021-22 సంవత్సరానికి యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సెర్ప్ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, నీడ కోసం షామియానాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రక్ షీట్ ఆధారంగా ట్యాబ్‌లలో నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు మహిళలు నడపడం అభినందనీయమన్నారు. అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, డీసీఎస్ఓ బ్రహ్మారావు, సివిల్ సైప్లె డీఎం గోపీకృష్ణ, అడిషనల్ డీఆర్డీఓ జోజప్ప, డీపీఎంలు సునీల్‌రెడ్డి, ఆనంద్, శ్రీనివాస్ ఏపీఎంలు పాల్గొన్నారు.