స్వయం సహాయక సంఘాల అభయ హస్తం పొదుపు డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారికే చెల్లించనున్నది. ఇందుకు సంబంధించి సభ్యుల ఖాతాల ఆన్లైన్ ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పథకంలో కాంట్రిబ్యూటరీ పింఛన్ కోసం గతంలో మహిళలు డబ్బును పొదుపు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆసరా పథకం కింద పింఛన్ రూపంలో రూ.2,016 చెల్లిస్తుండడంతో అభయ హస్తం పథకం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మహిళలు పొదుపు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 70,239 మందికి లబ్ధి కలుగనుండగా త్వరలోనే సంబంధిత నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వయం సహాయక సంఘాల్లో కొనసాగుతున్న మహిళా సభ్యులకు ఆర్థికంగా మరింత భరోసా కల్పించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ 2009లో అభయహస్తం పథకాన్ని అమలు చేసింది. 60 ఏళ్లు దాటాక ప్రతి నెలా పింఛన్ రూపంలో లబ్ధిపొందేలా ఈ పథకానికి అప్పటి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రతి సభ్యురాలు ఏటా రూ.365 చెల్లిస్తే ప్రభుత్వం తమ వాటా కింద రూ.360 జమ చేస్తుండేది. జమ చేసిన డబ్బులతో 60 ఏళ్లు నిండిన తర్వాత పింఛన్ కింద ప్రతి నెలా రూ.500 చొప్పున చెల్లించేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆసరా పథకం కింద నెలకు రూ.2,016 అందజేస్తుండడంతో అభయ హస్తం పథకం మూలనపడింది. పథకం నిలిచిపోవడంతో అభయహస్తం కింద తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని చాలాకాలం నుంచి మహిళలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు మంత్రి మండలి ఉపసంఘం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. మహిళా సంఘాల సభ్యులు కట్టిన డబ్బులకు వడ్డీ కట్టి మరీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో మహిళా సంఘం సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అభయ హస్తం పథకంలో మహిళలు పొదుపు చేసిన డబ్బుల చెల్లింపులతో జిల్లాలో 70,239 మంది స్వయం సహాయక సంఘం మహిళా సభ్యులు లబ్ధి పొందనున్నారు. ఇందులో ఎస్సీలు-17,259, ఎస్టీలు-5,085, బీసీలు- 43,616, ఓసీలు-3,565, మైనార్టీలు-714 మంది ఉన్నారు. ఆయా సభ్యులకు చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే వారి ఖాతాల్లోకి నగదు జమకానుంది. ఇప్పటికే జిల్లాలో అభయహస్తం పథకం కింద చెల్లించిన మహిళా సభ్యులను సెర్ప్ సిబ్బంది గుర్తించి వివరాలు సేకరించారు. నిలిచిపోయిన ఖాతాలను గుర్తించి తిరిగి రన్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
అభయ హస్తం పథకం లబ్ధిదారులకు నగదు చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంఘం సభ్యురాలి ఖాతాను ఆన్లైన్ చేయడం జరిగింది. ప్రభు త్వం నిధుల విడుదల చేయగానే నేరుగా సభ్యురాలి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.
– ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీఓ
మండలం లబ్ధిదారులు
అడ్డగూడూరు 2,097
ఆలేరు 5,074
ఆత్మకూరు(ఎం) 3,907
భువనగిరి 6,924
బీబీనగర్ 5,281
బొమ్మలరామారం 2,805
చౌటుప్పల్ 5,846
తుర్కపల్లి 3,596
మోటకొండూరు 2,492
మోత్కూరు 3,726
సంస్థాన్‌నారాయణపురం 4,512
భూదాన్‌పోచంపల్లి 4,294
రాజపేట 3,698
రామన్నపేట 5,511
వలిగొండ 6,257
యాదగిరిగుట్ట 4,219
మొత్తం 70,239