యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో గల బాలాలయాన్ని తొలగిస్తున్నారు. దాని స్థానంలో సంగీత భవనం నిర్మించేందుకు యోచిస్తున్నారు.ప్రధానాలయం పునర్నిర్మాణం పూర్తి కావడంతో బాలాలయంలోని పూజా కార్యక్రమాలన్నీ స్వయంభూ ఆలయానికి మారిపోయాయి. ఎకరం స్థలం గల బాలాలయంలో ఏమి నిర్మించాలో త్వరలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
లక్ష్మీనరసింహస్వామి బాలాలయం తొలగింపును శుక్రవారం ప్రారంభించారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా నూతనంగా పునర్నిర్మించిన ప్రధానాలయం పునఃప్రారంభం కావడంతో పక్కనే ఉత్తరదిశలో ఉన్న బాలాలయాన్ని తొలగిస్తున్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా గత ఆరేండ్లుగా బాలాలయంలో స్వామివారి సేవలు, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రధానాలయాన్ని పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తొలగిస్తున్న బాలాలయం ఎకరం విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాంతంలో సంగీత భవనం నిర్మించాలని వైటీడీఏ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రధానాలయంలో ఉన్న సంగీత భవనం కొనసాగింపుగా బాలాలయ ప్రాంగణంలో నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన భక్తులకు రోజూ స్వామివారిని దర్శించుకునే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈఓను వినతిపత్రం ద్వారా కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత కొన్నేండ్లుగా కొండపైకి వాహనాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆటోలను తిరిగి కొండపైకి అనుమతించాలన్నారు. ఆటో కార్మికులకు ఉపాధి లభించేవరకూ వాహనాలపై ఆంక్షలు సడలించాలని కోరారు. స్థానికులు తమ పుట్టినరోజు, పెండ్లి రోజు, ఇతర పండుగ దినాల్లో స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీ ఉందన్నారు. కొండపైన మీడియా లాంజ్ ఏర్పాటు చేయాలని కోరారు.