యాదాద్రి, సెప్టెంబర్ 29: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో బుధవారం స్వామి, అమ్మవార్ల నిత్యతిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేకువజామున స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపిన అర్చకస్వాములు ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చన చేశారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తర పూజలు వైభవంగా చేపట్టారు. బాలాలయ ముఖ మండపంలో రూ. 100 టిక్కెట్‌పై 10 నిమిషాల పాటు జరిగే అష్టోత్తర పూజలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. కొండపైన శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ. 2,63,595 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 30,330
రూ.100 దర్శనం టిక్కెట్ 14,600
వేద ఆశీర్వచనం 1,548
ప్రచారశాఖ 200
క్యారీబ్యాగుల విక్రయం 1,750
వ్రత పూజలు 4,000
కల్యాణకట్ట టిక్కెట్లు 5,400
ప్రసాద విక్రయం 1,31,160
వాహన పూజలు 2,700
టోల్గేట్ 610
అన్నదాన విరాళం 3,702
సువర్ణ పుష్పార్చన 48,440
యాదరుషి నిలయం 11,500
పాతగుట్ట నుంచి 1,655