
శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే కృష్ణావతారం
నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆలేరు టౌన్, ఆగస్టు 29 : ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఆనాటి పాండవులకే కాదు ఈనాటి భక్తులకు ఇదే సూత్రం వర్తిస్తుంది. సుఖానికి, మోక్షానికి ప్రథమ సోపానం భగవంతుడి అనుగ్రహమే. దైవానికి ప్రతీక శ్రీకృష్ణుడు. శ్రీమహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఒకటి. ఇందులో శ్రీకృష్ణుడు షోడస కళాపూర్ణుడు. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు అయినప్పటికీ మానవ మాత్రుడిగా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడల్లా మహిమలను ప్రదర్శిస్తూ దుష్ట శిక్షణ చేసినవాడు. ప్రేమ మూర్తిగా, శాంతి దూతగా, ధర్మ స్థంస్థాపన చేసిన మహనీయుడు. శక్తికి, యుక్తికి, అనురక్తికి సూత్రదారుడై అర్జునుడికి రథసారధి అయినాడు. ముక్తి సాధనమైన గీతాంమృతాన్ని ఉపదేశించి కర్తవ్యోముకుడిని చేసిన జగద్గురువు శ్రీకృష్ణుడు.
దేవకి, వసుదేవులకు జననం..
నీలిమేఘశ్యాముడు, పితాంబరధారి, చతుర్బుజుడు, శంకచక్ర, గదాపద్మదారుడైన శ్రీమహా విష్ణువు 8వ అవతారమే శ్రీకృష్ణావతారం. సుమారు 5వేల సంవత్సరాల కిందట కారాగారంలో దేవకి, వసుదేవులకు శ్రావణ బహుళ కృష్ణపక్ష అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో అర్థరాత్రి జన్మించాడు. ఆ కృష్ణుడి లీలలు వయోభేదం లేకుండా అందరినీ అలరించేవే. పాలు, పెరుగు, వెన్న దొంగగా చిలిపి చేష్టలతోపాటు చిన్న వయస్సులోనే పలువురు రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడి లీలా వినోదం వర్ణనలకు అతీతమైంది. అందుకే పారాడే పసి బిడ్డలందరూ ఈరోజు బాలకృష్ణులే. వాళ్ల అల్లరికి ఆనందించి అల్లారు ముద్దుగా పెంచుకునే తల్లులందరూ యశోదమ్మలే. ఆ బాలగోపాల పుణ్యాల పున్నమిగా శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటారు.
16108 భార్యలు..
నరకాసురుడు మణిపర్వతం అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమే గాక వరుణదేవుని చత్రాన్ని, దేవతల తల్లి అయిన అథితి కర్ణాభరణాలను దోచుకెళ్లాడు. ఇంద్రుడు శరణు వేడగా, శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ప్రాగ్యోతిషపురం వెళ్లాడు. యుద్ధంలో నరకాసురుడిని వధించాడు. అతడి వద్ద బందీలుగా ఉన్న 16108 మంది యువరాణులకు విముక్తి కలిగించాడు. శ్రీకృష్ణుడి దివ్యత్వానికి ముగ్దులైన వారంతా భక్తితో ప్రార్థిస్తూ తమను స్వీకరించమని కోరారు. ప్రతీ జీవిలో పరమాత్మగా ఉన్న కృష్ణుడు వారి కోసం నిష్కల్మష భక్తిని చూసి పత్నులుగా అంగీకరించాడు.