ప్రత్యామ్నాయ పంటలు, ధాన్యం కొనుగోళ్లపై అవగాహన సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎట్టి పరిస్థితుల్లో యాసంగిలో వరి సాగు చేయొద్దనే విషయాన్ని రైతులకు చెప్పేందుకు అధికారులు మొహమాట పడొద్దని, ఆదాయం తెచ్చే ఇతర పంటలు వేసుకోవాలనే విషయం రైతులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా వివరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. ‘యాసంగి-2021లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు’, ‘ధాన్యం కొనుగోళ్ల’పై బుధవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రి అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో, అనంతరం మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. రైతు పక్షపాతిగా రైతులను కాపాడుకునేందుకే సీఎం కేసీఆర్ వరి సాగుపై నిర్ణయం తీసుకున్నారని, గత ఏడేండ్లలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని మంత్రి అన్నారు. ఒకప్పుడు దారిద్య్రంతో కొట్టుమిట్టాడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ధాన్యం ఎగుమతులతో అన్నం పెట్టే స్థితికి వచ్చిందన్నారు. స్థానిక అవసరాల నిమిత్తం స్థానిక ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు పుష్కలంగా కూరగాయలను పండించిన రైతులే ప్రస్తుతం కూరగాయలను కొనే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మారాలని, చాలామంది రైతులు కూరగాయల సాగు ద్వారా అధిక లాభాలు పొందుతున్నారని పేర్కొన్నారు. సారవంతమైన భూములు, అనుభవం గల రైతులు ఉన్నప్పటికీ నీరు లేక గతంలో రైతులు గోస పడ్డారని, ప్రస్తుతం తెలంగాణలో నీళ్లు సమృద్ధిగా ఉన్నందున అద్భుతమైన డిమాండ్ ఉన్న పంటలను పండించుకోవచ్చని తెలిపారు. బయటి దేశాల నుంచి 80వేల కోట్ల విలువ గల నూనె గింజలను దిగుమతి చేసుకుంటున్నామని, ఈ నేపథ్యంలో కందులు, నువ్వులు, మినుములు, ఆవాలు, పెసర్లు, వేరుశనగ, పామాయిల్ తదితతర పంటలను సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వ్యవసాయ పద్ధతులపై వివరించాలి
వ్యవసాయ పద్ధతులపై అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని మంత్రి అన్నారు. వచ్చే యాసంగిలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విషయాన్ని రైతులకు స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచించారు. రైతులకు అధిక ఆదాయం వచ్చే పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించడంలో అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను చైతన్యపర్చాలన్నారు. ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సారవంతమైన భూములు ఉన్నాయని, ఈ భూములను సరైన పద్ధతిలో రైతులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిజానికి వరితోనే తక్కువ ఆదాయం వస్తుందని, రైతులు వరికి అలవాటుపడ్డారని.. రైతుల్లో మార్పు వచ్చేలా చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే ప్రభుత్వ భావన అని, అందుకుగాను డిమాండ్ ఉన్న పంటలపై రైతులు దృష్టి పెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
187 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు..
జిల్లాలో వానకాలం సీజన్లో 2,79,808 ఎకరాల్లో వరి సాగు అయ్యిందని, సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాబోతున్నదని మంత్రి పేర్కొన్నారు. అయితే ధాన్యం విక్రయానికి రైతులు ఇబ్బందులు పడకుండా ఈసారి ప్రభుత్వం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసిందన్నారు. గతంలో ఏర్పాటు చేసినట్లుగానే 187 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతుందని మంత్రి చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వసతుల పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, రవాణాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవగాహన సదస్సులో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనూరాధ, మార్కెటింగ్, సివిల్ సప్లయ్, వ్యవసాయ అధికారులు, డీలర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.