అమరావతి : వైసీపీ నాయకులకు( YCP Leaders ) కులరాజకీయాల ప్రస్తావనపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ( MLC Nagababu ) తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిన్న అవకాశం వచ్చినా కులాలను రెచ్చగొట్టి కుల రాజకీయాలు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. ఆదివారం ఎక్స్ ఖాతా ద్వారా వీడియోను విడుదల చేశారు.
వైసీపీ నాయకులకు ముని శాపం ఉందని, వారు నిజాలు చెబితే, తల వెయ్యి ముక్కలయ్యి చస్తారని అందుకే అబద్దాలు ఆడుతున్నాని విమర్శించారు. నోరు విప్పితే చాలు అబద్దాలు, బూతులు ఇవే వారికి తెలుసని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును ఇష్టారాజ్యాంగా తిడితే జైల్లో పెట్టక ముద్దు పెట్టుకుంటారా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వారికి కులాన్ని ఆపాదించి కుల చిచ్చు పెట్టేవారిని కూడా అరెస్టు చేస్తే దరిద్రం వదలిపోతుందని పేర్కొన్నారు.
కులం అనేది బై బర్త్…బై ఛాయిస్ కాదని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఉన్న కులాలు, చిన్న సంఖ్యలో ఉన్న కులాల వారిని ప్రోత్సహించినపుడే సామాజిక న్యాయం జరుగుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ ప్రకటించారు.
అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నలభై శాతం కాపులు ఉన్నప్పటికీ.. బీసీ సోదరుడు కొణతాల రామకృష్ణకు టికెట్ ఇచ్చారు. కాపులు, బీసీలు కలిసి పని చేసి రామకృష్ణను గెలిపించుకున్నారని వివరించారు. కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు అని పిచ్చిపిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని రంగా బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టిన వైసీపీ నేతలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.