
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అనాసక్తితో విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టేవారు. ఇప్పుడు.. సీన్ అంతా రివర్స్ అయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లోనూ ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్యను అందిస్తుండడం.. ఉచిత పుస్తకాలు, భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు మెరుగుపడిన నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో చేరేవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. జిల్లాలో మొత్తం 712 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో ఈ ఏడాది కొత్తగా 7,240 మంది అడ్మిషన్లు పొందారు. వీటిలో 1,346 అడ్మిషన్లు ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చినవే. ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల మోత తప్పకపోవడం.. కరోనా పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఇది భారం కావడం వంటి కారణాలు.. వారిని ప్రభుత్వ పాఠశాలలవైపుగా అడుగులు వేయిస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా అన్ని తరగతుల్లోనూ ప్రవేశాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతుందనడానికి ప్రస్తుతం మారిన పరిణామాలే నిదర్శనమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడ్డ వసతులు, బోధనా నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి నచ్చచెప్పడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల్లో చైతన్యం తెచ్చే దిశగా చొరవ చూపుతున్నారు. అంగన్వాడీల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వారిని ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువులు పూర్తయిన వారు ఉన్నత పాఠశాలల్లో చేరేలా శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు ఇలా నేరుగా ఉపాధ్యాయులే రంగంలోకి దిగడం సత్ఫలితాలిస్తోంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు.
కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. కొన్ని రోజులుగా పాక్షికంగా తెరిచినా విద్యార్థులకు అనుమతి ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులే పాఠశాలలకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు టీ-శాట్, దూరదర్శన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులతో పాటు మానిటరింగ్ బృందాలు ఇంటి వద్ద విద్యార్థులు పాఠాలు వినేలా చర్యలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రైవేట్‌లో ఇలాగే కొనసాగుతున్నా.. ఫీజుల కింద రూ.వేలల్లో వసూళ్లు చేస్తున్నాయి. టీశాట్ ద్వారా ప్రసారం చేస్తున్న పాఠాలకు, కార్పొరేట్ పాఠశాలల్లో అందిస్తున్న విద్యాబోధనకు పెద్దగా తేడా ఉండటం లేదన్న భావన సైతం తల్లిదండ్రుల్లో వచ్చింది. వేల రూపాయల ఫీజులు చెల్లించే బదులు ఉత్తమ విద్యాబోధన, ఎన్నో వసతులు ఉన్న సర్కారు పాఠశాలల్లోనే చేర్పించడం నయమంటూ చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్య అందుబాటులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇటువైపుగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకుల్లో ప్రతిభ కనబర్చడం, ట్రిపుల్ ఐటీ, జాతీయ ఉపకార వేతనాలకు అర్హత పొందడంలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులదే పైచేయిగా ఉంటుండటం వంటి అనుకూల పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలలకు వరంగా మారింది.
సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌కు సంబంధించిన విద్యాసంస్థలన్నీ ప్రారంభం కానుండటంతో జిల్లాలో శానిటైజేషన్ పనులు ముమ్మరమయ్యాయి. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఒక ఆశ్రమ పాఠశాల, 7 టీఎస్ ఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ పాఠశాలలు, 3 మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలు, 7 ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్ పాఠశాలలు, ఒక్కొక్కటి చొప్పున ఉన్న ఆర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రియ విద్యాలయం, 10 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, 153 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు, 4 సీబీఎస్ఈ సిలబస్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు, మదర్సాల్లో పారిశుధ్య, శానిటైజేషన్ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియను ఈనెల 29లోపుగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల అధికారులు, మండల అభివృద్ధి, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పాఠశాలలను సిద్ధం చేయాలని సూచించారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులు భౌతిక దూరం పాటించడంతోపాటు, మాస్క్‌లు విధిగా ధరించేలా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. క్రమం తప్పకుండా విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించి, అందుబాటులో ఉంచిన వైద్యులతో తగు చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన సామగ్రిని శుభ్రం చేయడం, స్వచ్ఛమైన ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోవడం, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా వ్యవస్థను బాగు చేసుకోవడం వంటి చర్యలు ఆయా పాఠశాలల్లో ఇప్పటికే మొదలయ్యాయి.
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 712 వరకు ఉన్నాయి. మరో ఏడు మోడల్ స్కూల్స్, 11 కేజీబీవీలు, టీఎస్‌ఆర్‌ఈఐ సొసైటీ స్కూల్స్ మూడు వరకు ఉన్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 7,240 మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు. వీరిలో 1,346 మంది ప్రైవేట్ స్కూళ్లకు గుడ్‌బై చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. ఎక్కడో దూర ప్రాంతాల్లో చేర్పిస్తే కరోనా పరిస్థితుల కారణంగా తమ పిల్లలపై పెట్టుకున్న బెంగతో చాలామంది తల్లిదండ్రులు దగ్గరలో ఉండే పాఠశాలల్లోనే తమ పిల్లలకు ప్రవేశాలు తీసుకుంటున్నారు. ఇంకా కొంతకాలం పాటు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు
తమ పిల్లల భవిష్యత్‌కు సర్కారు బడులే సరైనవని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. కొం తమంది ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలతోపాటు యూనిఫాం ఉచితంగా అందిస్తున్నాం. ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించుకోవడంతోపాటు, జాతీయ ఉపకార వేతనాలు అందుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరిస్తుండటం వల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
చైతన్య జైనీ, డీఈవో యాదాద్రి భువనగిరి జిల్లా