
పకడ్బందీగా ముందుకు సాగుతున్న పోలీస్ శాఖ
టోల్ ఫ్రీ నంబర్ 155260కు డయల్ 100 అనుసంధానం
నేరాల నియంత్రణపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
క్షేత్రస్థాయి వరకు సాంకేతిక వినియోగంపై దృష్టి
అవగాహన కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ
నీలగిరి, ఆగస్టు 26 : ఆన్లైన్ ద్వారా అమాయకులను నిండా ముంచుతున్న నేరగాళ్లను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ కూడా మరింత పకడ్బందీగా వ్యహరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో సైబర్ వారియర్ యూనిట్లను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసుల నమోదుతోపాటు పరిష్కారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. రెండేండ్ల కిందట కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్పీ)పై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్ 155260 ఉండగా, దానికి జనబాహుళ్యంలో విస్తృతంగా ఉన్న డయల్ 100ను కూడా అనుసంధానం చేసింది. దాంతో పోలీసులు నేరుగా కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ప్రతి శనివారం సైబర్ నేరాల నియంత్రణపై ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సైబర్ నేరాలు ఛేదించడంలో గతంలో పోలీసులు నెలలు, సంవత్సరాల తరబడి కష్టపడేవారు. నిందితులు దొరికినా చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని సులభంగా తప్పించుకునే వారు. అయితే, కాలానికి అనుగుణంగా పోలీస్ శాఖ అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నది.
మోసపోయినా నష్టపోవద్దనే..
అమాయక ప్రజలకు ఆన్లైన్ ద్వారా ఎరవేసి వారి ఖాతాలను కొల్లగొడుతున్న వారి ఆటలు ఇక చెల్లవు. ఓటీపీ, ఓఎల్ఎక్స్, నకిలీ ఫేస్ బుక్ఐడీ, ఫేక్ లింకులు, క్యూఆర్ కోడ్ ద్వారా జరుగుతున్న మోసాలకు చెక్ పడనుంది. బాధితుల బ్యాంకు ఖాతాలు ఖాళీ కాకుండా ఎన్సీఆర్పీ సాయంతో అడ్డుకట్ట వేయనున్నారు.
శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యం
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి తగ్గట్టుగా పోలీస్ సిబ్బందికి సైతం సాంకేతిక శిక్షణ అందించి తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు ప్రతి శనివారం అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి ఆన్లైన్ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. సైబర్ నేరాల కేసుల్లో ఆధారాలు సేకరించి నేరస్తులను గుర్తించడం, వారికి శిక్ష పడేలా చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయడాన్ని సవాలుగా తీసుకోనున్నారు. శిక్షణలో భాగంగా కంప్యూటర్ వైరస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ చాలెంజెస్, రిస్క్ అండ్ మేనేజ్మెంట్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ యాక్టు, కమ్యూనికేషన్, ఇంటర్నెట్ డాటా సెంటర్, నెట్ వర్కింగ్, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ ఆడిటింగ్ కంప్లయింట్స్, ఐఓటీ, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ రిస్క్, మొబైల్ అప్లికేషన్స్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ఇన్ ఈ గవర్నెన్స్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ కసరత్తు ప్రారంభించింది.
విస్తృత ప్రచారం…
పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరికి సోషల్ మీడియాపై శిక్షణ ఇస్తున్నారు. దాంతో ఏదేని ఘటన జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. పోలీసు స్టేషన్లకు ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ఫేస్బుక్ అకౌంట్లు తెరిచారు. జిల్లా వ్యాప్తంగా స్టేషన్ల వారీగా ఖాతాలు తెరిచి ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఇలాంటి నేరాలను నివారించడం కోసం కరపత్రాలు, వాల్ పోస్టర్ ద్వారా ప్రచారం చేయనున్నారు.
పోర్టల్ ద్వారా నగదు బదిలీ నిలిపివేత…
సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి నగదు బదిలీ కాకుండా చర్యలు తీసుకోవచ్చు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 155260తోపాటు డయల్ 100ను కూడా అనుసంధానం చేశాం. సాంకేతికతను జోడించడంతో కేసుల దర్యాప్తులో వేగంతో పాటు దోషులకు తప్పకుండా శిక్ష పడే అవకాశం ఉంటుంది.