
శ్రద్ధతో పనిచేసినప్పుడే విజయం
అనుభవం ఉన్న రంగంలోనే యూనిట్లు ఎంపిక చేసుకోవాలి
దళితబంధు డబ్బులతో ఆర్థికంగా ఎదగాలి
వాసాలమర్రిలో నేషనల్ ఎగ్కోఆర్డీనేషనల్ కమిటీ అడ్వైజర్ బాలస్వామి
కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చు
నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అడ్వయిజర్ బాలస్వామి
వాసాలమర్రిలో దళితులకు పశుపోషణపై అవగాహన
తుర్కపల్లి,ఆగస్టు 26 : కష్టించే మనస్తతత్వం, పట్టుదల ఉంటే ఎంచుకున్న ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చని నేషనల్ ఎగ్కో ఆర్డినేషన్ కమిటీ అడ్వయిజర్, ఫౌల్ట్రీ స్పెషలిస్ట్ కె. బాలస్వామి అన్నారు. వాసాలమర్రిలో గురువారం పశుసంవర్థకశాఖ, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పశుపోషణపై దళితులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రిని దత్తత తీసుకోవడం గ్రామస్తుల అదృష్టమన్నారు. ఈనెల 4న సీఎం రెండవ సారి గ్రామాన్ని సందర్శించి దళితుల ఆర్థిక స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకోవడమేకాక గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు కుటుంబానికి 10లక్షలు చొప్పున రూ.7.60కోట్లు మంజూరు చేయడంతో పాటు నిధులను విడుదల చేశారన్నారు. సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వందశాతం నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి దళిత కుటుంబంపై ఉందన్నారు. యూనిట్లను ఎంచుకునే క్రమంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఏ రంగంలో అనుభవం ఉందో ఆయా రంగాలలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కుటుంబానికి వచ్చిన 10లక్షలలో రూ.5లక్ష లు పాడి రంగానికి కేటాయించి మిగిలిన రూ.5లక్షలు ఇతర రంగాలకు కేటాయించుకోవాలన్నారు. పాడిరంగానికి కేటాయించుకున్న రూ.5లక్షలతో 3 గేదేలు, రూ.లక్షతో పొట్టేలు, మరో 50వేలతో నాటుకోళ్ల పెంపకం చేపట్టి కుటుంబం కష్టపడితే నెలకు రూ.40వేల వరకు ఆదాయం పొందవచ్చని సూచించారు. రైతులు పాలను పాల కేంద్రంలో కాకుండా హైదరాబాద్‌కు తరలించి అపార్ట్మెంట్లలో పోసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చునన్నారు. పొట్టెలు, నాటుకోళ్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉన్నందున ఆరంగంపై దృష్టి సారించి లాభాలు పొందాలన్నారు. లబ్ధి దారులు విడివిడిగా యూనిట్లు పెంచుకోవడంతో పాటు ముగ్గురు, నలుగురు కలిసి ఒక పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే సమష్టి కృషితో ఆర్థికంగా ఎదిగే అవకాశముందన్నారు. వాసాలమర్రి దళితులు దళితబంధు నిధులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగి రాష్ట్రానికి ఆర్థికంగా నిలవాలన్నారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ రమేశ్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి జి. కృష్ణ, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకుడు అయిలయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, పంచాయతీ అధికారి పండిట్రెడ్డి, భువనగిరి సహాయసంచాలకుడు గోపిరెడ్డి, శ్రీనివాస్‌రావు తదితరులున్నారు.