
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలు, దళిత వాడల అభివృద్ధిపట్ల ప్రత్యేక శ్రద్ధ
పెట్టింది. జిల్లాలోని ప్రతి తండా, దళిత వాడను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని 2,634 దళితవాడలు, 731 గిరిజన తండాల్లో సర్వేను నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకుగానూ రూ. 155కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధిత నివేదిక అంద గా..నిధుల కేటాయింపులు జరిపిన వెంటనే పనులను చేపట్టేందుకు జిల్లాయంత్రాం గం సన్నద్ధమవుతోంది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అని మహాత్మాగాంధీ కన్న కలలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తుంది. దీంట్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తూ గ్రామ పంచాయతీలను విరివిగా ప్రోత్సహిస్తుంది. ఆయా పంచాయతీల పరిధిలోని గిరిజన తండాలు, దళిత వాడల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు వంటి సదుపాయాలు ఇంకా అవసరం కావడంతో ఆయా మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ శాఖల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి చేపట్టాల్సిన పనులను గుర్తించింది. త్వరలోనే ఇందుకు సంబంధించి నిధులు వి డుదల కానుండడంతో తండాలు, దళిత వాడల్లో సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కా రం కానున్నాయి.
జిల్లాలోని 17 మండలాలు 421 గ్రామ పం చాయతీల పరిధి లో 2,634 దళిత వాడలు, 731 గిరిజన తండాలు ఉన్నాయి. ఆయా తం డాలు, దళిత వాడల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అన్ని పంచాయతీలలో అధికారులు సర్వే చేశారు. ప్రతి కాలనీ, ఇంటినీ పరిశీలించి అవసరమైన వివరాలు సేకరించారు. ఇందులో ప్రధానంగా సీసీ రోడ్లు, మురు గు కాల్వలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర అంశాలపై ఆరా తీశారు. గ్రామ, మండలస్థాయి అధికారులతోపాటు ఎంపీడీవోలు ఈ సర్వేలో భాగస్వామ్యులయ్యారు. ఏయే మౌలిక అవసరాలు ఉన్నాయి? వాటి అమలుకు ఎంత ఖర్చు అవుతుందనే అంచనాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తండాలు, దళిత కాలనీలకు మహర్దశ పట్టనుంది.
జిల్లాలోని 421 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న గిరిజన తండాలు, దళిత కాలనీల్లో 2,93,294.05 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.92.99కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. 2,91,353.73 మీటర్ల మురుగు కాల్వల నిర్మాణాలకు రూ.59.84కోట్లు అవసరం అవుతాయని నిర్ధారించారు. విరిగిన, శిథిలావస్థకు చేరిన 4,461 విద్యుత్ స్తంభాలను మార్చడంతోపాటు, కొత్తగా 2,568 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు రూ.2.18కోట్లు అవుతుందని ఎస్టిమేషన్లు రూపొందించారు. మొత్తంగా రూ.155 కోట్లు వ్యయం అవుతుందని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టేందుకు ఆయా శాఖల అధికారులు సన్నద్ధ్దమవుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పంచాయతీల పరిధిలో ఉన్న గిరిజన తండాలు, దళిత వాడల్లో సర్వే నిర్వహిం చాం. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకై అంచనాలతో కూడిన ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. నిధుల కేటాయింపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి,
యాదాద్రి భువనగిరి జిల్లా
నిర్మించాల్సిన సీసీ రోడ్లు : 2,93,294.05 మీటర్లు
అంచనా వ్యయం : రూ.92.99కోట్లు
నిర్మించాల్సిన మురుగు కాల్వలు : 2,91,353.73 మీటర్లు
అంచనా వ్యయం : రూ.59.84కోట్లు
ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ స్తంభాలు : 6,843
అంచనా వ్యయం : రూ.2.18కోట్లు