
తడి, పొడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారీ
మానవ మలవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రంతో జీవఎరువు
ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ ర్యాంకును ప్రకటించిన కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖ
భువనగిరి మున్సిపాలిటీకి దక్కిన ఓడీఎఫ్ ప్లస్ ప్లస్
తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ
మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రంలో బయోఎరువుల తయారీ
దేశంలోని మున్సిపాలిటీల స్వచ్ఛతపై నేషనల్ అర్బన్ శానిటైజేషన్ పాలసీలో భాగంగా మున్సిపాలిటీల స్వచ్ఛతకు కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖ ర్యాంకులు (ఓడీఎఫ్ ప్లస్ ప్లస్) ప్రకటించింది. రాష్ట్రంలోని తొమ్మిది మున్సిపాలి టీలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు ఎంపికకాగా అందులో భువనగిరి మున్సిపాలిటీ కూడా ఉంది. పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా స్థానం సంపాదించి భువనగిరి మున్సిపాలిటీ మరో ముందడుగు వేసింది.
భువనగిరి అర్బన్ ఆగస్టు 22: మున్సిపాలిటీల స్వచ్ఛతపై ప్రతి ఏటా కేంద్రం నేషనల్ అర్బన్ శానిటైజేషన్ పాలసీలో భాగంగా మున్సిపాలిటీలకు ర్యాంకులు ప్రకటిస్తుంది. వందశాతం బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు వ్యర్థాలను బయో ఎరువుగా మార్చి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చే మున్సిపాలిటీలకు ఓడిఎఫ్ ప్లస్‌ప్లస్ ర్యాంకులను ఇటీవల ప్రకటించింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో 9 మున్సిపాల్టీలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు ఎంపిక కాగా ఇందులో భువనగిరి మున్సిపాలిటీ కూడా ఉండడం విశేషం. పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, పట్టణం బహిరంగ మలవిసర్జన రహిత పట్టణం తీర్చిదిద్దడంతో పాటు పలు నిర్వహణలూ భేష్‌గా ఉండడంతో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ భువనగిరి మున్సిపాలిటీని ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌గా రా్ంయకును ప్రకటించింది.
జిల్లాలో 6 మున్సిపాలిటీలు…
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీతో పాటు మరో 5 మున్సిపాలిటీలు భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్ ఏర్పడ్డాయి. భువనగిరి మున్సిపాలిటీలో 2011 ప్రకారం మొత్తం జనాభా 59, 844. కాగా పట్టణంలో 13,811 ఇండ్లు, 1317 వ్యాపార సముదాయులున్నాయి. పట్టణంలో ఇంటింటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో 69 మరుగుదొడ్లు అందుబాటులో ఉండగా మరో 12 మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇందులో 1 కమ్యూనిటీ టాయిలెట్, మరొకటి మహిళా టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా మరోకటి దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక టాయిలెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఓడీఎఫ్ నుంచి ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు…
భువనగిరి మున్సిపాలిటీలోని గృహాల, వ్యాపార సముదాయాల నుంచి తడిపొడి చెత్త సేకరించడం, బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా పట్టణంగా మార్చడంపై అవగాహన కల్పించడం, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పించడంతో ప్రస్తుతం భువనగిరి మున్సిపాలిటీ ఓడిఎఫ్గా ఉంది. తర్వాత ఓడిఎఫ్ ప్లస్‌కు వెళ్లే క్రమంలో పట్టణంలోని గృహాలు, సామూహిక మరుగుదొడ్ల వినియోగంపై మారిన తీరుపై కేంద్ర బృందం అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ప్రకారం 2019లో ఓడీఎఫ్ ప్లస్‌లో స్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో పట్టణంలో ఇంటింటికి మరుగుదొడ్ల ఏర్పాటు, బహిరంగ ప్రాంతాలలో 69 శాతం పూర్తి కాగా, మరో 12 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండడం, పారిశుధ్యాన్ని మరింత మెరుగుపర్చడం, పట్టణంలోని సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన మానవ మల శుద్ధికరణ కేంద్రంలో రీసైక్లింగ్ చేసి బయోఎరువును తయారు చేయడం, తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు, పొడిచెత్త నుంచి అదనంగా ఆదాయం సమకూర్చడంతో పట్టణంలో పారిశుధ్యం మరింత మెరుగుపడింది. ఈ క్రమంలో నేషనల్ అర్బన్ శానిటేషన్ పాలసీ (ఎన్యూఎస్పీ)లో భువనగిరి మున్సిపాలిటీ ర్యాంకును ప్రవేశపెట్టగా కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖ భువనగిరి మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు ఎంపికైనట్లు ప్రకటించింది.
తడి, పొడి చెత్తతో మరింత ఆదాయం..
పట్టణంలో ప్రతి రోజు ఇంటింటికి సేకరించిన తడిచెత్త నెలకు 9 టన్నుల నుంచి 14 టన్నులు వస్తుంది. అదే విధంగా పట్టణంలో పొడిచెత్త 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు వస్తుంది. దీనిని డంపింగ్ యార్డుకు తరలించిన తర్వాత తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. తడి చెత్తను మాగబెట్టి సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈ ఎరువును పట్టణంలో హరితహారంలో ఏర్పాటు చేసిన మొక్కలకు ఎరువుగా వాడుతున్నారు. పొడిచెత్త (ప్లాస్టిక్, కవర్లు, అట్టలు) తో నెలకు రూ.40 నుంచి రూ.45 వేల వరకు అదనంగా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘం పొడిచెత్త విక్రయించడం జరుగుతుంది. పట్టణంలో సేకరించిన తడిపొడి చెత్తతో ఆదాయం రావడంతో పాటు పట్టణం పరిశుభ్రంగా మారుతుంది.
మానవ మల వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం..
భువనగిరి మున్సిపాలిటీని మరింత సుందరీకరణలో భాగంగా మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డు ఆవరణలో మానవ వ్యర్తాల మలశుద్ధీకరణ కేంద్రాన్ని 2020 అక్టోబర్ 2న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పట్టణంలో ఛీ అని ముక్కుమూసుకునే మానవ మల వ్యర్థాలను సైతం రీసైక్లింగ్ చేసి బయోఎరువుగా మార్చేందుకు ప్రభుత్వం రూ.1.26 కోట్ల నిధులతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. 15 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంలో రోజుకు 10 వేల లీటర్ల మానవ మల వ్యర్థాల నుంచి 600 కిలోల బయోసాలిడ్ (బయో ఎరువు)ను తయారు చేస్తారు. ఈ ప్లాంట్‌కు పట్టణంలోని సెప్టిక్ ట్యాంకుల నుంచి మలాన్ని సేకరించేందుకు మూడు ప్రైవేటు వాహనాలకు అనుమతించగా నెలకు 450 కిలో లీటర్ల మలాన్ని నేరుగా శుద్ధీకరణ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇందులో శుద్ధీకరణ అనంతరం వచ్చిన బయో ఎరువుతో పట్టణంలోని ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన చెట్లకు ఎరువుగా వాడుతున్నారు. దీంతో పట్టణం మరింత సుందరీకరణగా మారింది.
సమష్టి కృషితోనే ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు ఎంపిక
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో భువనగిరి మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు ఎంపికైంది. మున్సిపాలిటీకి మరిన్ని అవార్డులు వచ్చేలా పట్టణాన్ని అభివృద్ధి చేస్తా. పాలకవర్గ సభ్యులు, పట్టణ ప్రజలు, అధికారులు, సిబ్బంది అందరి కృషితోనే ఒక మెట్టు పైకి వెళ్లాం. ప్రతిరోజు పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉదయం నుంచే పనులను స్వయంగా పరిశీలిస్తున్న. పారిశుధ్యంలో భాగంగా ఇంటింటికి చెత్త సేకరణ సక్రమంగా జరగడం, బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా మార్చడం, పట్టణంలో 69 టాయిలెట్స్ పూర్తి కాగా మరో 12 నిర్మాణంలో ఉండడం, ఇంటింటికి టాయిలెట్ ఏర్పాటు చేసుకోవడంతో పట్టణం మరింత సుందరీకరణగా మారడంతో మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు ఎంపికైంది. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీరిదిద్దుతా.
ఎన్నబోయిన ఆంజనేయులు, మున్సిపల్ చైర్మన్
వ్యర్థాల తరలింపుపై అవగాహన
గృహాల్లో, ఇతర సముదాయాల్లో ఉపయోగించే సెప్టిక్ ట్యాంకులు నిండిన వెంటనే మున్సిపాలిటీలోని డంపింగ్యార్డులోగల మానవ మల వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రానికి తరలించేలా ప్రజలకు అవగాన కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా మున్సిపాలిటీలో టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. గృహాలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు ఆరునెలలకోసారి శుద్ధీ చేసుకోవాలి. వందశాతం ద్రవ వ్యర్థాల నుంచి 35 శాతం నాణ్యమైన ఎరువు వస్తుంది. పట్టణంలో సేకరించిన వ్యర్థాలను నేరుగా డంపింగ్ యార్డులోని ప్లాంట్‌కు చేరుతాయి. ఇందులో నుంచి వచ్చిన ఎరువును మొక్కలకు, నీటిని డంపింగ్‌యార్డులో ఏర్పాటు చేసిన పార్కులో వాడుతున్నాం.
జి.మహేశ్‌బాబు,
భువనగిరి మున్సిపాలిటీ పర్యావరణ అధికారిచాలా సంతోషం
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ భువనగిరి మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ ర్యాంకుకు ఎంపికైందని ప్రకటించడం చాల సం తోషం. నేషనల్ అర్బన్ శానిటేషన్ పాలసీలో మున్సిపాలిటీని ర్యాంకును ప్రవేశపెట్టగా ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు ఎంపికైంది. దీంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. ఈ ర్యాంకు సాధించడంలో ఉద్యోగుల పాత్ర కీలకం.
ఎం.పూర్ణచందర్, మున్సిపల్ కమిషనర్, భువనగిరి