హైదరాబాద్, ఫి్ర బవరి 10 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది మామిడి పూత ఆలస్యం అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో మామిడి మార్కెట్లోకి వచ్చింది. దిగుబడులు తక్కువగా ఉండటంతో వేసవికిముందే ధరలు మండిపోతున్నాయి. సాధారణంగా సీజన్ చివర్లో దొరికే తోతాపురి (కోతమామిడి)కి ఈ ఏడాది మాత్రం మొదట్లోనే రికార్డుస్థాయిలో ధర పలుకుతున్నది. ఈ క్రమంలో తెలుగు రాష్ర్టాల నుంచి ముంబై మార్కెట్కు ఎగుమతి అవుతున్న తోతాపురి మామిడి టన్నుకు రూ.1.05 లక్షలు ధర పలికినట్టు వ్యాపారులు వెల్లడించారు. తోతాపురికి ఇంత రేటు రావడం రైతులు, వ్యాపారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో తోతాపురి మామిడి కిలో రూ.100కు పైగా ధర పలుకుతున్నది.
ఈ నేపథ్యంలో మామిడి రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్కు వస్తున్న మామిడి కాయలు నాణ్యతా పరంగా బాగుండటం, ఎగుమతులకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో రైతులకు లాభసాటిగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లోని విసన్నపేట ప్రాంతం నుంచి ఎక్కువగా ముంబైకి తోతాపురి మామిడి ఎగుమతి అవుతున్నట్టు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఇవే ధరలు మార్చి, ఏప్రిల్, మేలో కూడా కొనసాగితే గత కొన్నేండ్లుగా నష్టాలతో ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులు ఈ ఏడాది భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. వేసవి ముందే మామిడి ధరలు ఇలా ఉంటే సీజన్ పెరిగే కొద్దీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.