
వైభవంగా స్వామివారికి నిత్య పూజలు
సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని తరించిన భక్తులు
స్వామి వారి ఖజానాకు రూ. 13,46,575 ఆదాయం
యాదాద్రి, ఆగస్టు21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రావణ మాస సందడి నెలకొంది. శ్రావణమాసం రెండో శనివారాన్ని పురస్కరించుకుని బాలాలయంలో స్వామి అమ్మవార్లకు నిత్యారాధనలు వైభవంగా జరిగా యి. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీఅర్చన వరకు నిత్యపూజలను అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూడుగంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేకపూజలు చేశారు. హారతినివేదనలు అర్పిం చి స్వామివారికి నిత్యకైంకర్యాలను చేపట్టారు. శ్రీసుదర్శన హోమం ద్వారా స్వామివారిని కొలిచారు. స్వామిఅమ్మవార్ల నిత్యతిరు కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని కనులారా వీక్షించి తరించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనం పై ముఖమండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకుపైగా కల్యాణతంతును జరిపారు. ఆలయంలో అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారిని సహస్రనామార్చన చేశారు.
సత్యనారాయణ స్వామి వ్రతాల్లో ..
శ్రావణమాసం సందర్భంగా యాదాద్రిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శనివారం వ్రతాల్లో 203జంటలు పాల్గొని, భక్తితో వ్రతమాచరించాయి.
స్వామివారిని దర్శించుకున్న ఆదిలాబాద్ ఎంపీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు స్వామివా రి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
పాతగోశాల వద్ద ప్రసాద విక్రయ కేంద్రం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని పాతగోశాల వద్ద భక్తుల సౌకర్యార్థం శనివారం ఆలయ అధికారులు ప్రసాద విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని పాతగోశాల వద్ద గల విశ్రాంతి గదుల్లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతమాచరించే భక్తులతోపాటు స్థానికులకు స్వామివారి ప్రసాదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రసాద విక్రయశాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
స్వామివారి ఖజానాకు రూ.13,46,575 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.13,46,575 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,92,824, రూ.100 దర్శనంతో రూ.2,800, వీఐపీ దర్శనం ద్వారా రూ.94,500, నిత్యకైంకర్యాలతో రూ.600, సుప్రభాతం ద్వారా రూ.4,021, క్యారీబ్యాగుల తో రూ.5,500, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.1,01,500, కల్యాణకట్టతో రూ. 24,600, ప్రసాద విక్రయంతో రూ. 5,33,890, శాశ్వతపూజలతో రూ.24,696, వాహనపూజలతో రూ.11,600, టోల్గేట్తో రూ.1,400, అన్నదాన విరాళంతో రూ. 58, 631, సువర్ణ పుష్పార్చనతో రూ. 1,11,200, యాదరుషి నిలయంతో రూ.70,800, పాతగుట్టతో రూ.32,935, ఇతర విభాగాలతో రూ. 75,048తో కలుపుకొని రూ. 13,46,575 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.