యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రికి మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో చాపర్ ద్వారా చేరుకున్న సీఎం కేసీఆర్ ఘాట్ రోడ్డు నుంచి కాన్వాయ్‌లో నేరుగా బాలాలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. వేదపండితుల నుంచి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను అందుకున్న సీఎం కేసీఆర్ తన సుదీర్ఘ పర్యటనను కొనసాగించారు. పనుల పురోగతిని ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి ముఖ్యమంత్రికి వివరించగా, కొండపైన, కొండ కింద చేపట్టిన అభివృద్ధ్ది పనులతో పాటు ప్రధానాలయంలో అద్భుతంగా చెక్కిన శిల్పాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరికించారు. తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కోరగా దీనిపై నిర్ణయం ఎప్పుడో తీసుకున్నం కనుక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆలయ అర్చకులు, ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదే విధంగా రోడ్డు నిర్మాణ స్థలంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వెయ్యి స్కేర్ ఫీట్ల విస్తీర్ణంలో దుకాణాలు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. తరతరాలుగా క్షేత్రాన్ని ఆశ్రయించి బతుకుతున్న వారి బతుకుదెరువుకు ఎలాంటి భంగపాటు రానివ్వొద్దని సూచించారు.
అందరూ దీవించాలి..
28-03-2022న నిర్వహించ తలపెట్టిన మహాకుంభ సంప్రోక్షణ చిన జీయర్ స్వామి సూచనలతో విద్వత్తు, సిద్ధాంతుల సభలో ముహూర్తం నిర్ణయించడం జరిగిందని సీఎం కేసీఆర్ మహా సుదర్శన హోమంతోటి సంప్రోక్షణ మొదలవుతుందని తెలిపారు. వేల మంది రుత్వీకులు పాల్గొంటున్న ఈ మహాకార్యానికి వివిధ పుణ్యక్షేత్రాల పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి అభినందిస్తూ.. ‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన ఆలయం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’ అని అభినందించారు. లక్షల మంది వచ్చే యాదాద్రిలో దుర్వాసన అనేది లేకుండా హైదరాబాద్ జలమండలి సాయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వర్షాకాలంలో నీరు వెళ్లేలా రెండు రకాలుగా డ్రైనేజీ వ్యవస్థను చేపట్టి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు.
మైసూర్ బృందావన్ గార్డెన్‌ను తలపించేలా..
నృసింహ సాగర్ రిజర్వాయర్ చెంతనే ఉన్న 450 ఎకరాల్లో మైసూర్ బృందావన్ గార్డెన్ తలపించేలా సౌందర్యంగా పార్కులు, ఫౌంటెన్లు, కన్వనేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ భూమిని టూరిజం శాఖకు అప్పగిస్తామని.. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప సౌందర్య ప్రాంతంగా మారనున్న ఈ ప్రాంతం రాబోవు రోజుల్లో సినిమా షూటింగ్‌లు, డెస్టిని మ్యారేజ్‌లకు నెలవుగా మారనుందని సీఎం అన్నారు. యాదాద్రిపై యాదాద్రి రుషి పేరుతో మెడిటేషన్ సెంటర్‌ను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని సీఎం తెలిపారు. జర్నలిస్టులకూ ఇండ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆ బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి చూసుకుంటారని సీఎం చెప్పారు. జర్నలిస్టులు ఆలయ మార్పును చూశారు కాబట్టి వార్త వాహకులుగా ఆలయ వార్తలు, రాష్ట్ర విశిష్టతను చక్కటి పరిశోధన వ్యాసాలుగా అందించాలని సీఎం సూచించారు.
ఆర్టీసీ బస్ టర్మినల్‌కు రూ. 6.90 కోట్లు
భక్తుల సౌకర్యం కోసం కొండ కింద లక్ష్మీపుష్కరిణి చెంత నిర్మించనున్న ఆర్టీసీ బస్ టర్మినల్‌కు రూ. 6.90 కోట్ల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు భక్తులు కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్టాండ్ నిర్మాణం చేపట్టడంతో భక్తులు కొండపైకి వెళ్లేందుకు ఉచిత బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఇవన్నీ ఆలయ మహా కుంభ సంప్రోక్షణ నాటికి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.ఆయన వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, భువనగిరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కలెక్టర్ పమేలా సత్పతి, సీఎంఓ భూపాల్‌రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు నల్లందీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు చేపట్టారు.