రాజాపేట, అక్టోబర్ 19 : మండలంలోని గిరిజన తండా అయిన పుట్టెగూడెం పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నది. మౌలిక వసతుల కల్పనలో గ్రామపంచాయతీ చూపుతున్న శ్రద్ధతో పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
1100మంది జనాభా…
మండలంలోనే ఏకైక తండా పుట్టెగూడెం. 1100 మంది జనాభా, 760 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామానికి 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా ప్రతి నెలా రూ.60 వేలతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. గ్రామంలోని పారిశుధ్య కార్మికులకు నెల నెలా జీతాలు అందిస్తూ పారిశుధ్య పనులను పక్కాగా నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
పల్లె పగ్రతి పనులు పూర్తి
పుట్టెగూడెం తండాలో పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయి. రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్‌యార్డు, రూ.2 లక్షలతో పల్లె పకృతి వనం, రూ.1.40 లక్షలతో వన నర్సరీని ఏర్పాటు చేశారు. రూ.2.50 లక్షలతో పాఠశాల ప్రహరీ నిర్మాణం, ఎమ్మెల్సీ నిధులు రూ.5 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నారు. రోడ్లకు ఇరువైపులా 3 వేల మొక్కలు నాటి సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి.
చూసేందుకు పట్టణంలా : ఒకప్పుడు పల్లెగా ఉన్న గిరిజన తండా, నేడు పట్నంలా మారింది. నాడు పూరి గుడిసెలతో దర్శనమిచ్చే తండా నేడు ఖరీదైన, విలాసవంతమైన భవనాలతో పట్టణంలా దర్శనమిస్తున్నది. గ్రామస్తులంతా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కష్టించి పోగు చేసిన సొమ్ముతో బంగ్లాలు నిర్మించుకున్నారు.
పల్లె ప్రగతితోనే అభివృద్ధి
పల్లె ప్రగతితోనే గ్రామంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించుకుంటున్నాం. గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలన్నీ ఒకేచోట నిర్మించుకున్నాం. ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటి సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి పచ్చగా కనిపిస్తున్నాయి. గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయి.
-మాడోతు దేవీరాములునాయక్, సర్పంచ్
తండా రూపురేఖలు మారాయి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో తండా రూపురేఖలు మారిపోయాయి. గ్రామ అభివృద్ధిలో గ్రామస్తులంతా సహకారం అందిస్తున్నారు. గ్రామంలో పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయి. గ్రామస్తులంతా చిన్నా, పెద్దా తేడా లేకుండా కష్టపడి పనిచేసి వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. నాడు పూరి గుడిసెలతో ఉన్న తండా నేడు భవనాలతో పట్టణాన్ని తలపిస్తున్నది.
-మాడోతు లక్ష్మణ్‌నాయక్, పుట్టెగూడెం