
సకల హంగులతో ముస్తాబవుతున్న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం
తుదిదశకు చేరిన పనులు.. 20 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి
త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్న కలెక్టర్ పమేలాసత్పతి
అన్ని శాఖలు ఒకే చోటకు రావడంతో ప్రజలకు తొలగనున్న ఇబ్బందులు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. భువనగిరి నుంచి యాదాద్రికి వెళ్లే మార్గంలో రాయగిరి సమీపంలో ప్రధాన రహదారి పక్కన రూ.53.20కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణ పనులను చేపట్టారు. మొత్తం 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులలో జీప్లస్-2 పద్ధతిన నిర్మాణాన్ని చేపట్టారు. అత్యాధునిక సదుపాయాలతో భవన నిర్మాణ పనులు పూర్తికాగా.. సకల హంగుల కల్పనలో భాగంగా తుది మెరుగులు దిద్దే పనులు ఊపందు కున్నాయి. పనులు వేగవంతంగా సాగేలా..కలెక్టర్ పమేలాసత్పతి నిరంతరం పర్యవేక్షిస్తుం డగా..20 రోజుల్లో భవనం అందుబాటులోకి రానున్నది. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వివిధ చోట్ల దూరంగా.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోటకు రానుండటంతో పాలనా సౌలభ్యం పెరిగి ప్రజలకు ఇబ్బందులు తీరనున్నాయి.
తుదిదశకు చేరిన పనులు.. 20రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
త్వరలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
ఎప్పటికప్పుడు ఏర్పాటు పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి
అన్ని శాఖలు ఒకేచోటకు రానుండటంతో ప్రజలకు తప్పనున్న ఇబ్బందులు
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. లాక్డౌన్లో పనుల్లో కొంత జాప్యం నెలకొన్నప్పటికీ గత నాలుగు నెలల కాలంలో తిరిగి పనులు ఊపందుకున్నాయి. రూ.53.20 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న భవన నిర్మాణానికి 2017 అక్టోబర్ 11న శంకుస్థాపన చేశారు. భువనగిరికి 6కి.మీ.ల దూరంలో ఉన్న రాయగిరి సమీపంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌ను 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, మొదటి అంతస్తును 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండవ అంతస్తును 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. నాలుగు బ్లాకుల్లో భవన నిర్మాణ పనులు పూర్తికాగా, కొద్దిపాటిగా అక్కడక్కడ మిగిలిపోయిన పనులు జరుగుతున్నాయి. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులను కలెక్టర్ పమేలాసత్పతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్ని వసతులతో, ఆధునిక హంగులతో కలెక్టరేట్ భవనం రూపుదిద్దుకుంటుండగా, త్వరలోనే సీఎం కేసీఆర్
చేతులమీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
90 శాతానికి పైగా పూర్తయిన పనులు
ప్రభుత్వపరమైన కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు అనువుగా ఉండేలా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని డిజైన్ చేయగా, అందుకనుగుణంగా నిర్మాణాలను చేపడుతున్నారు. ఆడిటోరియం నిర్మాణంతోపాటు సెమినార్ హాళ్లు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు నలుగురు జిల్లా అధికారుల కోసం క్యాంపు కార్యాలయాలను కూడా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలోనే చేపడుతున్నారు. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలో వివిధ శాఖల కార్యాలయాల గదులు ఉన్నాయి. జిల్లా మంత్రి కోసం ప్రత్యేకించి కార్యాలయ గదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. భవన నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు పూర్తవ్వగా, కొన్నింటికి రంగులు వేయడం కూడా పూర్తయ్యింది. కొన్నింట్లో ఫర్నిచర్‌ను సైతం సమకూర్చారు. ఇప్పటి వరకు 90శాతం పనులు పూర్తవ్వగా, ప్రస్తుతం ల్యాండ్ స్కేపింగ్, స్ట్రీట్ లైటింగ్, ఫుట్‌పాత్‌లకు సంబంధించిన పను లు కొనసాగుతున్నాయి. ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంతోపాటు కలెక్టరేట్ భవనానికి మరింత వన్నె తెచ్చేలా పూల మొక్కలు, పార్కులు, వాటర్ ఫౌంటేన్, అందమైన కళాకృతులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు, ప్రజలు, సందర్శకుల కోసం వేర్వేరుగా వాహనాల పార్కింగ్ కోసం సదుపాయాలను చేపడుతున్నారు.
తీరనున్న ప్రజల వెతలు
సమీకృత కలెక్టరేట్ సముదాయం పరిధిలోకి సుమారు 36 ప్రభుత్వ శాఖలు రానున్నాయి. ప్రస్తుతం కలెక్టరేట్ కార్యాలయం భువనగిరి పట్టణానికి 5కి.మీ.ల దూరంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై పగిడిపల్లి సమీపంలోని అద్దె భవనంలో కొనసాగుతున్నది. ఇక్కడ కొన్ని శాఖలు మాత్రమే ఉండగా, సగానికి పైగా శాఖలు వివిధ చోట్ల దూరం దూరంగా ఉన్నాయి. ఇందులో చాలా వరకు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. నూతన కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చాక అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరనున్నాయి. దీంతో ఇప్పటివరకు కార్యాలయాల పనుల నిమిత్తం వచ్చి ఇబ్బందులు పడ్డ ప్రజల వ్యయ ప్రయాసలు త్వరలోనే తీరనున్నాయి. కార్యాలయాలకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టాయిలెట్స్, షాపులు, ఏటీఎం, బ్యాంకు వంటి అన్ని సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బందికి, వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి సౌలభ్యం కోసం ప్రత్యేకించి నాలుగు లిఫ్టులను సైతం ఏర్పాటు చేస్తున్నారు.