
పల్లె ప్రగతి పనులు నూరుశాతం పూర్తి
అదనపు ఆకర్షణగా మోడల్ మియావాకి పార్కు
పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామ ముఖచిత్రాన్ని మార్చివేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన అభివృద్ధి పనులు నూరు శాతం పూర్తయ్యాయి. అదనంగా పచ్చదానికి పెద్ద పీట వేస్తూ ఏర్పాటు చేసిన మియావాకి పార్కు ఊరంతటికీ అందాన్ని తీసుకువచ్చింది. సెగ్రిగేషన్ షెడ్డులో చెత్తను వేరుచేసి ఎరువులు తయారు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ పంచాయతీ.
ప్రతి పల్లె పట్టణానికి దీటుగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి పథకం గ్రామాల రూపురేఖలను మార్చేసింది. దీంతో పల్లెలు పరిశుభ్రంగా ముస్తాబయ్యాయి. గణపవరం గ్రామం పల్లె ప్రగతి పనులు వంద శాతం పూర్తి చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నది. పార్టీలకు అతీతంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి తమ గ్రామాన్ని తీర్చిదిద్దుకున్నారు. ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మించుకున్నారు. సెగ్రిగేషన్ షెడ్డులో ఎరువు తయారీ ప్రారంభించగా, పల్లె ప్రకృతి వనంలో వేలాది మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందారు. ఈ నేపథ్యంలో మండలంలో ఉత్తమ పంచాయతీ అవార్డును జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా పాలకవర్గం అందుకున్నది.
రూ.కోటీ 40లక్షలతో అభివృద్ధి పనులు…
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం ద్వారా మంజూరు చేసిన నిధులు, ఉపాధిహామీ నిధులు, 14వ ఆర్థిక సంఘం, పంచాయతీరాజ్ జనరల్ నిధులు.. మొత్తం రూ.1.40కోట్లతో అభివృద్ధి పనులు, పలు నిర్మాణాలు జరిగాయి. పల్లెప్రకృతి వనంలో పూలు, పండ్లు నీడనిచ్చే, ఔషధ రకానికి చెందిన 2వేల మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి పార్కు పచ్చని తీవాచీ పరిచినట్లుగా చూపరులను ఆకట్టుకుంటున్నది. దీంతో పాటుగా గ్రామంలోని వాటర్ ట్యాంకు వద్ద వెయ్యి మొక్కలతో ఏర్పాటు చేసిన మియావాకి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. ప్రజలు సేదతీరేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. చుట్టూ రక్షణ కోసం కంచెతోపాటు గేటు, వాకింగ్‌కు బాటలు నిర్మించారు. మొక్కలకు నీరందేలా ప్రత్యేకంగా బోరును ఏర్పాటు చేశారు.
మియావాకితో కొత్త అందం సంతరించుకుంది
గ్రామంలో మియావాకి తరహాలో వెయ్యి మొక్కలతో ఏర్పాటు చేసిన పార్కుతో గ్రామం నూతన అందం సంతరించుకున్నది. గతంలో పార్కు అంటే పట్నానికే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం మాఊరిలో మియావాకి వనంతో పాటు పల్లె ప్రకృతి వనంలో రెండు పార్కులు అందుబాటులో ఉన్నాయి. చిన్నారులు పార్కులో ఆడుకుంటుండగా, పెద్దలు సాయంత్రం వేళ సేదతీరుతున్నారు.
ప్రగతి పనులు నూరు శాతం పూర్తి
సుమారు రూ.30లక్షలతో పల్లె ప్రగతి పనులను వంద శాతం పూర్తి చేశాం. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు సొంత నిధులు కూడా ఖర్చు చేస్తున్నాం. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సహాయ, సహకారంతో మరిన్ని నిధులతో గ్రామంలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం.