
ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తయిన 385 డబుల్ బెడ్రూం ఇండ్లకు విద్యుదీకరణ చేపట్టాలని, దానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని కలిసి విన్నవించారు.
యాదాద్రి, సెప్టెంబర్ 11 : ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల విద్యుదీకరణకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట, వంగపల్లి, తుర్కపల్లి గ్రామాల్లో, మోటకొండూర్ మండల కేంద్రం, ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతోపాటు ఉప్పలపహాడ్, ఆలేరు మండల కేంద్రం, కొలనుపాక గ్రామాల్లో 385 ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ దసరాకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యుదీకరణ పనులకు సంబంధించిన అంచనాలను రూపొందించామని, విద్యుత్ శాఖ నిధులు మంజూరు చేసి అనుమతులు ఇవ్వాలని మంత్రిని కోరారు. అదేవిధంగా బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు గొంగిడి సునీత వినతిపత్రం అందజేశారు. రాజాపేట మండలంలో నూతన గ్రామ పంచాయతీ మల్లగూడెం నుంచి పాముకుంట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.80 కోట్లు మంజూరు చేయాలని కోరారు.