
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని,తుది మెరుగులను ఆలస్యం చేయొద్దని సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్‌రెడ్డి వైటీడీఏ అధికారులను ఆదేశించారు. ప్రధానాలయంతోపాటు క్యూ లైన్లు, రథశాల, లిప్టు భవనం, శివాలయం, విష్ణుపుష్కరిణి, పార్కింగ్ స్థలం, కొండకింద గండిచెరువు, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, ప్రెసిడెన్సియల్ సూట్ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత పనులపై అధికారులతో సమీక్ష జరిపారు.
యాదాద్రి, సెప్టెంబర్ 11 : యాదాద్రి ఆలయ తుది మెరుగుల పనులను అక్టోబర్ చివరిలోగా పూర్తి చేయాలని సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్‌రెడ్డి వైటీడీఏ అధికారులను ఆదేశించారు. ప్రధానాలయం పనులు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో మిగతా పనులపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైటీడీఏ, ఆలయ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ముందుగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికి, స్వామివారి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం వైటీడీఏ అధికారులతో కలిసి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, శివాలయం, శ్రీవారి మెట్ల నిర్మాణంతోపాటు విష్ణు పుష్కరిణి నిర్మాణాల క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రసాద విక్రయశాల వద్ద నిర్మిస్తున్న ర్యాంపు, క్యూలైన్ల నిర్మాణాలను పరిశీలించి భక్తులకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలన్నారు. ప్రధానాలయ ద్వార దర్వాజాలకు బిగించాల్సిన ఇత్తడి, వెండి తొడుగుల తయారీపై స్వర్ణకారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో విద్యుద్దీపాలంకరణ, క్యూ లైన్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. కొండపైకి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఎస్కలేటర్‌ను, వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఉత్తర భాగంలో నిర్మితమవుతున్న ప్రహరీ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం యాదాద్రి కొండపై ఆధునీకరిస్తున్న గండి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల తీరుపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. గండిచెరువు పక్కనే పూర్తయిన లక్ష్మీ పుష్కరిణిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పక్కనే నిర్మిస్తున్న కల్యాణకట్ట భవన నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. దాదాపు పూర్తయి తుది దశ పనులు కొనసాగుతున్న ప్రెనిడెన్సియల్ సూట్లు వీక్షించారు. రింగ్‌రోడ్డు, సర్కిల్, కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సుమారు 2 గంటల పాటు సమీక్ష జరిపారు. కార్యక్రమంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆలయ ఈఓ ఎన్.గీత, ఆర్కిటెక్ట్ అనంద్సాయి, వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఈఈ సునీల్, ఆలయ ఇంజినీర్ మహిపాల్‌రెడ్డి, స్థపతి మొగిలి, వైటీడీఏ అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.