
రాష్ర్టాన్ని పచ్చని వనంలా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. జూలై 1 నుంచి మొదలైన ఏడో విడుత యజ్ఞంలా నడుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1.87 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1.43 మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మొదలుకుని సామాన్య ప్రజల వరకు మహోత్తర కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే ఆరు విడుతల్లో నాటిన మొక్కలు పెరిగి పచ్చదనం పంచుతుండగా రెండు నెలలుగా గ్రామాలు, పట్టణాల్లో నాటుతున్న మొక్కలు మరింత శోభను తెస్తున్నాయి. మొక్కల జియోట్యాగింగ్‌లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల తర్వాత రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా మూడో స్థానంలో నిలవడం విశేషం. అడవుల్లో పచ్చదనం పెంపొందించేందుకు యాదాద్రి జిల్లాలో అటవీశాఖ డ్రోన్ ద్వారా విత్తన బంతులను చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వర్షాలు సైతం సమృద్ధిగా కురుస్తుండడంతో ఊరూరా ఉద్యమంలా సాగుతున్నది. ఊరూ-వాడ ఒక్కటై కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండగా.. జిల్లా స్థాయి అధికారులు రోజుకోచోట హరితహారంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు సైతం ఇందులో భాగస్వాములై మొక్కలను నాటుతున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేయడంతో ఇళ్ల ఆవరణలో పూలు, పండ్ల మొక్కలను చాలా వరకు నాటుకున్నారు. ఓ వైపు మొక్కలు నాటుతూనే.. మరోవైపు గుంతలు తీసే పనులు వేగంగా సాగుతున్నాయి. అడవిజాతి మొక్కలతో పాటు ఫలాలు ఇచ్చే మొక్కలను సైతం ఈసారి హరితహారంలో నాటుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలు, ప్రధాన రహదారులకు ఇరువైపులా పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల ఆవరణల్లో విరివిగా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పొలం గట్ల వెంట తాటి వనాలను నాటే దిశగా సంబంధిత శాఖ అధికారులు వేగవంతంగా చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటివరకు 1.43కోట్ల మొక్కల నాటింపు…
ఏడో విడుత హరితహారంలో భారీ స్థాయిలో నాటాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం నర్సరీల్లో పెద్ద ఎత్తున మొక్కలను పెంచింది. ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేయగా, అటవీశాఖ సైతం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసి ఉంచింది. మొత్తం 12 శాఖలు సమన్వయంతో పనిచేసి గత కొద్దిరోజులుగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అనుకున్న లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తిచేసే దిశగా అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. నల్లగొండ జిల్లాలో 71 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 62లక్షల మొక్కలు నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 30లక్షల లక్ష్యానికిగాను 27లక్షల మొక్కలను, సూర్యాపేట జిల్లాలో 86లక్షల లక్ష్యానికిగాను 54లక్షల మొక్కలు నాటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1.43కోట్ల మొక్కల నాటింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను కూడా ఆయా శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. మొక్కలకు నీళ్లు పోసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇవన్నీ ఆకుపచ్చ తెలంగాణకు బాటలు పరుస్తున్నాయి.
గ్రీన్ ఛాలెంజ్ తోడుగా..
ఏడో విడుత హరితహారం కార్యక్రమానికి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం తోడ్పాటునందించింది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కోటి వృక్షార్చన, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించి మొక్కలు నాటారు. ఇదే స్ఫూర్తితో సందర్భమేదైనా సంతోషకర సమయాల్లో మొక్కలు నాటడం పరిపాటైంది. సందర్శనలు, పుట్టిన రోజు, పెళ్లి వేడుకలు, పండుగలు ఇతర కార్యక్రమాల సందర్బాల్లోనూ విరివిగా మొక్కలు నాటుతున్నారు. అంతరించిపోయిన అడవుల విస్తీర్ణం పెంపునకు తెలంగాణ ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టిన హరితహారం కార్యక్రమం మూడు జిల్లాల్లోనూ సత్ఫలితాలను ఇస్తున్నది.
జియోట్యాగింగ్‌లో మూడో స్థానం..
ఓ వైపు విస్తృతంగా మొక్కలు నాటే ప్రక్రియను చేపడుతూనే మరో వైపు నాటిన మొక్కల జియోట్యాగింగ్ ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ మొక్కలను నాటుతుండడంతో జియోట్యాగింగ్ చేయడం వల్ల వందకు వందశాతం మొక్కలు బతికేందుకు వీలు కలుగుతుంది. యాదాద్రి జిల్లాలో 2,599 సైట్స్, 21లక్షల మొక్కల జియోట్యాగింగ్ పూర్తయ్యింది. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా(94.68శాతం), నిజామాబాద్(77.26శాతం) తర్వాత 76.27 శాతంతో యాదాద్రి భువనగిరి జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
డ్రోన్ ద్వారా విత్తన బంతులు వెదజల్లడం..
యాదాద్రి జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయి యాత్రా స్థలంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఇక్కడకు వచ్చే యాత్రికులు ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణాన్ని సాగించేలా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే నృసింహ, ఆంజనేయ అభయారణ్యాలను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతాన్ని సృష్టించేందుకు అటవీశాఖ డ్రోన్ ద్వారా విత్తనబంతులు చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బుధవారం 50వేల బంతులను డ్రోన్ ద్వారా వెదజల్లారు. సీఎంఓ అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంత కుమారి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శాటిలైట్‌తో అనుసంధానించడం ద్వారా సీడ్స్ బాల్స్ గ్రోత్‌ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేలా టెక్నాలజీని రూపొందించారు.
యాదాద్రి జిల్లాలో వివిధ శాఖలు
లక్ష్యాలను అందుకున్నాయి ఇలా..
శాఖ పేరు – లక్ష్యం
గ్రామీణాభివృద్ధి – 9 లక్షలు
పంచాయతీరాజ్ – 6లక్షలు
మున్సిపల్ – 3.65లక్షలు
అటవీ – 3.50లక్షలు
వ్యవసాయ – 0.25లక్షలు
ఉద్యానవన – లక్ష
ఎక్సైజ్ – 0.50లక్షలు
ఇరిగేషన్ – 0.20లక్షలు
విద్య – 0.20లక్షలు
పరిశ్రమలు – 0.50లక్షలు
ఆర్అండ్బీ – 1.70లక్షలు
ఈఈ పీఆర్ – 0.50లక్షలు
మొత్తం – 27లక్షలు