
59,809 మంది రైతులకు రూ.743 కోట్ల చెల్లింపులు పూర్తి
యాసంగిలో రికార్డు స్థాయిలో 4,23,652.560 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
సాగుకు అనుకూల పరిస్థితులు.. ప్రతి యేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులు
గడిచిన నాలుగేండ్లలో జిల్లాలో 18,28,696.564 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు
నాలుగేండ్లలో రైతులకు చెల్లించిన ధాన్యం చెల్లింపుల విలువ అక్షరాలా రూ.3,220 కోట్లు
జిల్లాలో చరిత్రలో.. రికార్డు స్థాయిలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా అంచనాలకు మించి ధాన్యం సేకరించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలన్న సర్కారు లక్ష్యానికి మించి కొనుగోళ్లు జరిగాయి. గత యాసంగిలో రూ.743కోట్ల విలువగల 4,23,652.560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో మూసీతోపాటు గోదావరి జలాలు అందుబాటులోకి రావడం.. సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గడిచిన నాలుగేండ్లలో ప్రతి యేటా సాగుతో పాటు దిగుబడులు సైతం పెరిగాయి. ఈ క్రమంలో గడిచిన నాలుగేండ్లలో జిల్లాలో రూ.3,220కోట్ల విలువగల 18,28,696.564 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. ఇది రికార్డు అని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
యాసంగిలో కొనుగోళ్లు జరిపిన కేంద్రాలు : 292
ధాన్యం విక్రయించిన రైతుల సంఖ్య : 59,809 మంది
నాలుగేండ్లలో మొత్తం ధాన్యం సేకరణ : 18,28,696.564 మెట్రిక్ టన్నులు
నాలుగేండ్లలో రైతులకు చెల్లించిన ధాన్యం డబ్బులు :రూ.3,220కోట్లు
నిన్నమొన్నటి వరకు మూసీనది మినహా చెప్పుకోదగ్గ సాగునీటి వనరులు లేవు..బీడు బారిన పొలాలు.. భూగర్భ జలాలు అడుగంటి ఆగిఆగి పోసే పంపు సెట్లు.. తడారి, పొడిబారి, పొలమారిన ఆ భూముల్లో ఎర్రగా ఎండిపోయినట్టుండే పంటలు తప్పితే పచ్చదనమే కనబడేది కాదు. మరిప్పుడు ఆ దుస్థితి పోయింది. గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయి. సీజన్ సీజన్‌కూ పెరుగుతున్న సాగు విస్తీర్ణం నేపథ్యంలో పంట చేలల్లో ధాన్యపు రాశులు పోటెత్తుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పంట పండి ప్రభుత్వం ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాలకు టన్నుల కొద్దీ వడ్ల రాశులు తరలిరాగా..ప్రతి సీజన్లోనూ కోట్ల రూపాయల ధాన్యం వ్యాపారం జరిగింది. లక్షల రూపాయల పైకం రైతుల చేతికందింది. జిల్లాలో గడిచిన నాలుగేండ్ల లో వ్యవసాయ రంగంలో ఈ అద్భుతం
ఆవిష్కృతమైంది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో రైతులు చాలా వరకు బోరు బావులను నమ్ముకొని సేద్యం చేస్తున్నారు. మూసీనది పరీవాహక ప్రాంతాలైన భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని రైతులు పూర్తి గా వరిపంటనే సాగుచేస్తూ వస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బోర్లు, బావుల కింద వ్యవసాయం చేస్తున్నారు. వలసలకు మారుపేరుగా నిలిచే ఈ ప్రాంతంలో జీవకళను కోల్పోయిన చెరువులు మినహా చెప్పుకోదగ్గ సాగు నీటి వనరులు మచ్చుకైనా కనిపించవు.
పరాయి పాలనలో ఛిద్రమైన ఈ ప్రాంత రైతుల బతుకు తీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మారిపోయింది. మిషన్ కాకతీయతో బావులు, బోర్లలో పెరిగిన భూగర్భ జలాలకు తోడు పెట్టుబడి సాయం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఈ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడ్డాయి. పుష్కలంగా మూసీనది, గోదావరి నీళ్లు సాగుకు అందుబాటులోకి రావడంతో బీడు భూముల్లోనూ నేడు పంటలు సాగవుతున్నాయి. ఆ ఊరు ఈ ఊరు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా వరి పంటలే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో భారీ స్థాయిలో ధాన్యం దిగుబడులు సైతం వస్తున్నాయి.
కొవిడ్ సంక్షోభంలోనూ రైతులకు అండగా ప్రభుత్వం..
గతేడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధా న్యం కొనుగోలు చేస్తూ వస్తున్నది. గతంలో జిల్లా లో కొద్దిపాటిగా ఏర్పాటు చేసిన కేంద్రాలకు కిలోమీటర్ల దూరం నుంచి రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి విక్రయించేవారు. లేదంటే కల్ల్లాల వద్దనే దళారులకు అమ్ముకునేవారు. ముఖ్యంగా కొవిడ్ పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు పల్లెల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి ప్రభుత్వం కొండంత ధైర్యాన్నిచ్చింది. ఈసారి యాసంగిలో జిల్లాలో పండించిన ధాన్యా న్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో 96, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 192, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యం లో 4 కలిపి మొత్తం 292 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. యాసంగి కొనుగోలు లక్ష్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు కాగా..లక్ష్యానికి మించి 4.23లక్షల మెట్రిక్ టన్నుల వరకు ప్రభుత్వం ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. కొవిడ్ పరిస్థితుల్లోనూ రైతులకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం అండగా నిలిచింది. ఊహకందని రీతిలో చేతికందుతున్న ధాన్యం కారణంగా గడిచిన మూడు, నాలుగేండ్ల కాలంలోనే ఈ ప్రాంత రైతుల బతుకు తీరులోనూ పెను మార్పు లు వచ్చాయి.
ఏటేటా పెరుగుతూ వస్తున్న సాగు విస్తీర్ణం..
ప్రస్తుతం జిల్లాలో సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనగా.. రైతులు ఇష్టంతో పంటలను సాగు చేస్తున్నారడానికి గత నాలుగేండ్ల కాలంలో జిల్లా లో పెరిగిన సాగు విస్తీర్ణమే నిదర్శనం. 2017-18 వానకాలంలో జిల్లాలో 3.44 లక్షల ఎకరా ల్లో పంటలు సాగవ్వగా.. 2020-21 వానకాలం నాటికి సాగు విస్తీర్ణం 4.38 లక్షల ఎకరాలకు పెరిగింది. అలాగే 2017-18 యాసంగిలో 1.20 లక్షల్లోనే ఉన్న పంటల సాగు ఏకంగా 2020-21 యాసంగి నాటికి 2.40లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రస్తుత వానకాలంలో 3,64,793 ఎకరాల్లో పంటలు సాగు కావొచ్చ ని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీరు.. ఉచి త విద్యుత్ సరఫరా వంటి పరిస్థితుల నేపథ్యంలో వలసవెళ్లిన ఎన్నో కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాయి. సకాలం లో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించడంతోపాటు విత్తనాలు, ఎరువులను సమృద్ధ్దిగా రైతులకు అందుబాటులో ఉంచడం వంటి చర్యల ఫలితంగా ఒకప్పుడు ఎకరంలోనే సేద్యం చేసిన రైతు లు నేడు పది ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.
యాసంగి ధాన్యం చెల్లింపులు పూర్తి
జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతంగా పూ ర్తి చేశాం. యాసంగి కొనుగోళ్ల లక్ష్యం 4 లక్షల మెట్రి క్ టన్నులు కాగా అంతకుమించి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. యాసంగిలో రూ.743 కోట్ల విలువగల 4,236,52.560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి రైతుకూ చెల్లింపుల ప్రక్రియ వందశాతం పూర్తయ్యింది.
-గోపీకృష్ణ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, యాదాద్రి భువనగిరి జిల్లా