
యాదాద్రి, యాదాద్రి ఆలయంలో స్వామివారికి బుధవారం అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు స్వ యంభువులు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. లక్ష్మీనరసింహులను దివ్యమనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన నారసింహహోమం, స్వామివారి నిత్యతిరు కల్యాణాన్ని, అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే సామూహిక సత్యనారాయణ స్వా మి వారి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు యాదాద్రి బాలాలయంలో ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు లో భాగంగా అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పురపాట్ సేవ నిర్వహించారు.
స్వామివారి ఖజానాకు రూ.8,81,178 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 92,008, రూ.100 దర్శనంతో రూ.52,000, నిత్యకైంకర్యాలతో రూ.2,032, క్యారీబ్యాగులతో రూ.1,375, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.68,500, కల్యాణకట్టతో రూ. 28,600, ప్రసాద విక్రయంతో రూ.4,01,450, శాశ్వతపూజలతో రూ.18,348, వాహనపూజలతో రూ.6,700, టోల్గేట్తో రూ.1,250, అన్నదాన విరాళంతో రూ.12,090, సువర్ణ పుష్పార్చనతో రూ.67,020, యాదరుషి నిలయంతో రూ. 68,980, పాతగుట్టతో రూ.14,725, టెంకాయల విక్రయం తో రూ.36,000, ఇతర విభాగాలతో రూ.10,000 తో కలుపుకొని రూ.8,81,178 ఆదాయం సమకూరిందన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంతోపాటు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.
ఆందోళ్‌మైసమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు11: దండు మల్కాపురం ఆందోళ్‌మైసమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీని బుధవారం నియమించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన కమిటీని ప్రకటించారు. ఏడాదిపాటు ఈ కమిటీ కొనసాగనున్నది. సభ్యులుగా సిద్దిపేట శేఖర్‌రెడ్డి, చిట్టెంపల్లి చంద్రశేఖర్, బొర్ర జంగారెడ్డి, సుంకరి రమేశ్, అత్తాపురం ప్రతాప్‌రెడ్డి, పెరుమాండ్ల రాజీవ, నవీన్‌కుమార్, ముదిగొండ శంకరయ్య, చింతపట్ల మైసమ్మ, పిల్లి ఎర్రయ్య, కొయ్యడ శ్రీధర్‌గౌడ్, మల్కాజిగిరి బాబు, మహేందర్‌యాదవ్, బండారు పోన్నయ్య తదితరులను నియమించారు.
రామగిరి, ఆగస్టు11: రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఆండాళ్ తిరునక్షత్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో 108 కలశాలతో చిన జీయర్‌స్వామి ప్రత్యే క అభిషేకాలు జరిపించారు. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా దేవా దాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేందర్‌కుమార్ తులసీనగర్ భక్తాంజనేయస్వా మి ఆలయ మేనేజర్ రుద్ర వెంకటేశంతో కలిసి జీయర్‌స్వామికి దుస్తులు, పండ్లు, పుష్పాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి చినజీయర్ స్వామి తీర్థప్రసాదాలను అంద జేశారు. ఈ వేడుకలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి దంపతులు, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రామరాజు, నాయకులు, ఆలయ కమిటీసభ్యులు, భక్తులు పాల్గొన్నారు.