
యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాలకు బానిసై కొందరు పెడదోవపడుతున్నారు. వీరిలో కొందరు యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని కష్టపడుతుండగా.. మరికొందరు లక్ష్యం లేకుండా తమ విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. గురువారం అంతర్జాతీయ యువత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
“కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు, కొంత మంది యువకులు ముందు యుగం దూతలు… నవజీవన బృందావన నిర్మాతలు” అన్నారు శ్రీశ్రీ ఓ సినిమాలో. యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. కొందరు ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకొని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటుండగా మరికొందరు చెడు వ్యసనాలకు బానిసలై పెడదోవ పడుతున్నారు.
ఆలేరు టౌన్, ఆగస్టు 11 : ఆధునిక కాలంలో వస్తున్న సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు సాగుతుండగా మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు, సెల్ఫోన్లకు, మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. పాఠశాల స్థాయిలోనే కొందరు విద్యార్థులు పెడదోవ పడుతుండగా , వయసుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసం చెడు అలవాట్ల వైపు దారి మరలుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలలు, కళాశాలలు యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడంతో విద్యార్థుల గతి తప్పుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్సు గల వారు 2,80,990 ఉన్నట్లుగా సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైంది.
నేడు పరిగెడుతున్న సాంకేతిక విప్లవానికి తోడుగా ప్రతి ఒక్కరీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఫోన్ చేతిలో ఉంటే సమస్తం ఉన్నట్లే అని భావించే కొందరు యువకులు అదేపనిగా వాడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వీటితో మోసాలకు పాల్పడుతూ నేరగాళ్లుగా తయారవుతుండడం కలవరపాటుకు గురిచేస్తుంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదని కొన్నిచోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తుంది. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ నేపథ్యంలో విద్యార్థుల చదువుల పేరిట సెల్‌ఫోన్ వాడడం సాధారణమైంది. అంతే కాకుండా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, లాప్టాప్ల మోజులో పడి నీలి చిత్రాలకు ఆకర్షితులవుతున్నారు. అంతే కాకుండా పిల్లలకు కళాశాల స్థాయిలోనే ఖరీదైన బైకులు కొని ఇస్తుండడంతో అతివేగంతో ప్రమాదాలకు గురి అవుతున్నారు. కళాశాలల పేరిట ఇంటి నుంచి బయటకు వెళ్లి సినిమాలు, రిసార్ట్లు, పబ్బులు, వెంచర్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్‌లోనే మందు కొడుతున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, ఆపై స్థాయి విద్యలో చెడు అలవాట్లకు బానిసగా మారి హద్దులు దాటుతున్నారు. గంజాయి సేవిస్తూ మత్తులో జోగుతున్నారు. యాదాద్రి జిల్లాలో కూడా యువత వీటికి అలవాటు అవుతున్నారు. కొన్నిచోట్ల మద్యానికి బానిసైన వారు డబ్బులు లేకపోవడంతో హత్యలకు పాల్పడుతున్నారు. లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తూ వేరేవారి మరణాలకు కారణమవుతున్నారు. అలాగే జల్సాల కోసం నేరాల బాట పడుతున్నారు.
చెడుబాట పడుతున్నట్లుగా ఇంట్లో మొదట గుర్తించాల్సింది తల్లిదండ్రులే. విద్యార్థి దశలో చెడు స్నేహాలతో సిగరెట్, మందుకు అలవాటు పడిన వారు మత్తు పదార్థాల వైపు కచ్చితంగా వెళ్తారు. వారిని గుర్తించాలి. ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకుంటే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు గుర్తించాలి. చదువులో వెనకబడడం, పరీక్షలు బాగా రాయకపోవడం, ఒంటరిగా ఉండడం, ప్రవర్తనలో మార్పు, ఆలస్యంగా నిద్ర పోవడం, సెల్‌ఫోన్‌తో గడపడం, అబద్దాలడడం వంటి ప్రవర్తనలు తల్లిదండ్రులు గుర్తించాలి. చిన్నవాటికి, పెద్దవాటికి కోపం, చికాకు చూపడం చేస్తుంటారు. వారిపై ఒక కన్నేసి చూడాలి. గంజాయి తాగే వారి కండ్లు ఎరుపుగా ఉంటాయి. వారిని గుర్తించాల్సి ఉంటుంది. ఒంటరిగా ఉండకుండా చూడాలి. కాసేపు మనసు విప్పి వారితో మాట్లాడాలి. పిల్లలకు అతిస్వేచ్ఛ ఇవ్వవద్దు. ఖాళీ సమయాల్లో ఎవరితో స్నేహాలు చేస్తున్నారో చూడాలి. ప్రేమ పేరుతో మోసపోతున్నారు. పిల్లలకు ఇష్టారీతిన పాకెట్ మనీ ఇవ్వవద్దు.
నైతిక విలువల పట్ల అవగాహన కలిగి ఉండాలి. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండేలా చూడాలి. చదువు, కెరీర్‌పై దృష్టి సారించేలా చూడాలి. మానవత్వం గురించి వివరించాలి. సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. జీవితమంటే సరదాలు, షికార్లే కాదు.. లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. ప్రలోభాలకు గురి కాకుండా ఒక కన్నేసి చూడాలి. వాట్సప్, ఫేస్‌బుక్‌లతో కాలాన్ని వృథా చేయకుండా చూడాలి. కళాశాలల యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలి. ప్రేమ పేరుతో ఒంటరిగా పిలిస్తే యువతిలు వెళ్లకపోవడం మంచిది.