
ఆగస్టు 4న… దత్తత గ్రామం వాసాలమర్రి గడ్డమీద ప్రకటించిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఆ మర్నాడే దళిత బంధు పథకం కింద రూ.7.60కోట్లను కలెక్టర్ ఖాతాకు విడుదల చేయగా, బుధవారం రాత్రి 66 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున రూ.6.60కోట్లను అకౌంట్లలో జమ చేశారు. మిగిలిన పది కుటుంబాలకు నేడో, రేపో అందించనున్నారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తుర్కపల్లి : ఉన్న చోట ఉపాధి లేక పొట్టకూటి కోసం కడుపు చేతబట్టుకుని వలసవెళ్లిన ఆ కుటుంబాలకు ‘దళిత బంధు’ భరోసా కల్పిస్తున్నది. అందరూ ఉన్నా.. చెట్టుకొకరుగా బతుకుతూ ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారిని సైతం ఈ పథకం ఒకే దగ్గరకు చేరుస్తున్నది. కారు, ఆటో డ్రైవర్లుగా.. కోళ్లఫాం, డెయిరీ వంటి యూనిట్లతో ఆత్మగౌరవంగా బతికేలా ఆర్థిక తోడ్పాటునందిస్తున్నది. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం వరంలా పరిణమించగా.. చేతికందిన పది లక్షల రూపాయలు ఆయా కుటుంబాలకు కొండంత ఆసరా ఇస్తున్నాయి. సీఎం కేసీఆర్ అందించిన చేయూతతో ఉపాధికి బాటలు వేసి ఆగమైన తమ బతుకులను బాగు చేసుకుంటామని దళిత కుటుంబాలు ముక్తకంఠంతో పేర్కొంటున్నాయి.
నా భర్తకు ఆటో ట్రాలీ కొనిస్తా..
వాసాలమర్రికి చెందిన చిన్నూరి ప్రవళిక సంఘ బంధం రుణంతో ఫుట్‌వేర్ షాపును నడుపుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నది. భర్త మహేశ్ లారీ డ్రైవర్ కావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయం భయంగా గడుపుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దళిత బంధు పథకం కింద అందించిన రూ.10లక్షలతో భర్తకు ట్రాలీ ఆటోను కొనిచ్చి స్థానికంగానే ఉపాధి పొందేలా చూస్తానని ప్రవళిక అంటున్నది.
నైపుణ్య శిక్షణకు సర్వం సిద్ధం..
వాసాలమర్రిలో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ సహా ఉన్నత విద్యావంతులైన యువతీ యువకులు 300పైగానే ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో 2019 సంవత్సరంలో యాదగిరిగుట్టలో కేంద్రాన్ని ప్రారంభించారు. వివిధ కోర్సుల్లో నామమాత్రపు ఫీజుతో తర్ఫీదు ఇస్తున్నారు. అయితే ఈ కేంద్రాన్ని ఇక్కడి నుంచి వాసాలమర్రికి తరలించి స్థానిక యువతకు ఉపయోగపడేలా సర్వం సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఎస్సీ హాస్టల్ భవనంలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మూడు నెలలపాటు ఇచ్చే ఈ శిక్షణలో 250 మందికి మొబైల్ సర్వీస్, టైలరింగ్, ఎలక్ట్రీషియన్, బ్యుటీషియన్, కంప్యూటర్ తదితర డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఎన్రోల్ మెంట్ ప్రక్రియ చేపట్టగా.. ఎంఎస్ ఆఫీస్ కోర్సుకు 51 మంది, ఎలక్ట్రీషియన్‌కు 9 మంది, టైలరింగ్‌కు 50 మంది, బ్యుటీషియన్ కోర్సుకు 19 మంది, మొబైల్ సర్వీస్ శిక్షణకు ఐదుగురు పేర్లను నమోదు చేసుకున్నారు. ఐదు కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐదుగురు శిక్షకులను కూడా నియమించారు. త్వరలోనే శిక్షణ మొదలుకానుంది. అనంతరం సర్టిఫికెట్లను అందజేయనున్నారు. తద్వారా బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చేందుకు ముందుకు రానుండడంతో యువతీ, యువకులు తాము శిక్షణ పొందిన రంగంతో జీవనోపాధి పొందేందుకు అవకాశం కలుగుతుంది. దళిత బంధు పథకంలో భాగంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారికి సైతం ప్రస్తుత శిక్షణ దోహదపడనుంది.
క్షేత్రస్థాయి పర్యటనలో దళితులు..
ప్రభుత్వం మంజూరు చేసిన దళిత బంధు నిధులతో వాసాలమర్రిలో వివిధ యూనిట్లను నెలకొల్పే దిశగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శాశ్వత ప్రాతిపాదికన యూనిట్లు ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. ఇప్పటికే లబ్ధిదారులు యూనిట్లను ఎంపిక చేసుకోగా.. వారిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి అవగాహన కల్పించేలా చూస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం వాసాలమర్రి నుంచి 29 మంది దళితులు బస్సులో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. జిల్లాలోని కందుకూరు, కూనూరు, రాయగిరి, ధర్మారెడ్డిగూడెంలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న డెయిరీ, గొర్రెలు, కోళ్ల ఫామ్‌లను సందర్శించి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. వారి వెంట ఎస్సీ కార్పొరేషన్ ఏడీ శ్యాంసుందర్, జిల్లా పశువైద్యాధికారి కృష్ణ, ఎంపీడీఓ ఉమాదేవి ఉన్నారు.
తండ్రీ, కొడుకులకు ఉపాధి..
వాసాలమర్రికి చెందిన చిన్నూరి మనోజ్ ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి పోచయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సొంతిల్లు లేదు. గుడిసెలోనే నివాసం ఉంటున్నారు. మనోజ్ పెళ్లయ్యాక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఎకరం భూమి వీరి జీవనాధారం. ప్రభుత్వం నుంచి దళిత బంధు కింద రూ.10లక్షలు ఇవ్వడంతో అశోక్ లేలాండ్ గూడ్స్ బండి తెచ్చుకుని తండ్రీ, కొడుకులిద్దరం ఉపాధి పొందుతామని మనోజ్ అంటున్నాడు. మిగిలిన డబ్బులతో బర్రెలు తెచ్చుకుని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాడు.
ఎలక్ట్రికల్ షాపుతో ఇద్దరు కొడుకులకూ ఉపాధి…
నిన్న మొన్నటి వరకు ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేసిన దుబ్బాసి కిష్టయ్య ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఉన్న ఊర్లో ఉపాధి కరువై ఒక కొడుకు హైదరాబాద్‌లో కిరాణా దుకాణంలో, మరో కొడుకు ప్రైవేటు కళాశాలలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పదేళ్లుగా ఇద్దరు కొడుకులు చెరో దిక్కుపోయి బతుకుతుండడం కిష్టయ్యకు బాధ కల్గిస్తున్నది. ప్రస్తుతం దళిత బంధు డబ్బులు రూ.10లక్షలు రావడంతో ఆ డబ్బులతో ఎలక్ట్రికల్ హార్డ్‌వేర్ షాప్‌ను పెట్టి ఇద్దరు కొడుకులు ఒకే చోట పనిచేసుకునేలా చేయడం వల్ల ఇన్నాళ్ల తన వేదన తీరుతున్నదని కిష్టయ్య సంతోషంగా చెప్తున్నాడు.
కోళ్లఫామ్తో కుటుంబమంతటికీ ఉపాధి…
దుబ్బాసి కవితకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. భర్త రమేశ్‌కు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన ట్రాక్టర్‌తో ఉపాధి పొందుతున్నాడు. తాజాగా దళిత బంధు పది లక్షలు రావడంతో కోళ్లఫాం ఏర్పాటు చేసుకుని కుటుంబమంతా ఉపాధి పొందాలని కవిత అనుకుంటున్నది. ఉన్న ఎకరం భూమిలో వర్షాధారంగానే పంటలు పండించుకుంటూ ఇబ్బందులు పడ్డామని, మిగతా డబ్బులతో రెండు బర్రెలు తెచ్చుకొని, బోరు వేసుకుని వ్యవసాయం చేసుకుంటానని కవిత ఆనందం వ్యక్తం చేస్తున్నది.
చెప్పలేనంత ఆనందంగా ఉంది..
నా బ్యాంకు అకౌంట్లో పది లక్షల రూపాయలు పడ్డట్టు రాత్రి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. ఆ విషయాన్ని మా ఇంట్లో వాళ్లందరికీ చెప్పిన. మా కుటుంబ సభ్యులందరం చాలా సంతోష పడ్డాం. ప్రస్తుతం నాకున్న ఎకరంతో పాటు మరో మూడు ఎకరాలు పాలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా. దళితబంధు డబ్బులతో ట్రాక్టర్ డోజర్ కొనుక్కొని జీవనోపాధి పొందుతా.
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం..
దళితబంధు డబ్బులు అకౌంట్ల పడేసరికి చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన మాట ప్రకారం మా అకౌంట్లో డబ్బులు జమచేయించారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. మేం పదేండ్ల సంది కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. కూరగాయల తరలింపులో ఆటోలు దొరకక చాలా ఇబ్బంది పడ్డాం. కేసీఆర్ సార్ ఇచ్చిన డబ్బులతో ట్రాలీ ఆటో కొనుక్కుంటాం.
డయాగ్నస్టిక్ ల్యాబ్ పెట్టుకుంటా…
దళితబంధు పథకం కింద మా కుటుంబానికి పది లక్షలు వచ్చినయి. బ్యాంకు ఖాతాలో పడ్డయని నిన్న రాత్రి మెసేజ్ వచ్చింది. నేను రెండేండ్ల కింద భువనగిరిలో ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాను. సార్ ఇచ్చిన డబ్బుతో ఏదైనా ఆస్పత్రి వద్ద డయాగ్నస్టిక్ ల్యాబ్ పెట్టుకొని మా కుటుంబానికి అండగా ఉంటా.
ఎన్నడన్నా ఇంత డబ్బు చూడలేదు…
నాలుడేండ్లుగా గ్రామపంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తున్నా. ఎన్నడూ లక్ష రూపాయలు కూడా చూసింది లేదు. రాత్రి ఒక్క సారిగా నా అకౌంట్లో 10లక్షలు పడ్డాయని ఫోన్‌కు మెసెజ్ రావడంతో మా కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. సార్ ఇచ్చిన డబ్బులతో ఉన్న ఎకరం భూమిలో బోరు వేసుకుంటాం. షెడ్డు వేసుకుని బర్లు పెంచి వచ్చే ఆదాయంతోని జీవితం గడుపుతాం.
కోళ్ల ఫారమ్ పెట్టుకుంటా..
ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది. కొంతమంది గిట్టనోళ్లు.. ‘మీకు డబ్బులు ఏడ వస్తయి..!’ అని ఎగతాళి చేసిన్రు. కానీ, సీఎం కేసీఆర్ సార్ మీద నాకున్న అపారమైన నమ్మకం నిజమైంది. డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. వచ్చిన డబ్బులతో కోళ్లఫారం నిర్మించుకోని కష్టపడి పనిచేసి సారుకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం.
మరో ముగ్గురికి ఉపాధి కల్పిస్తా…
వాసాలమర్రికి చెందిన ఇతడి పేరు దుబ్బాసి ప్రవీణ్. నాలుగేండ్లుగా అరకొర సామగ్రితో సెంట్రింగ్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. దళిత బంధు కింద వచ్చిన రూ.10లక్షలతో జాకీలు, పిల్లర్ బాక్స్‌లు వంటివి కొని ఉపాధిని మెరుగుపర్చుకుంటానని చెబుతున్నాడు. ప్రస్తుతం నలుగురికి ఉపాధి కల్పిస్తున్నానని.. సామగ్రి కొన్నాక మరో ముగ్గురికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అంటున్నాడు.