
గ్రామీణ ఆర్థిక పరిపుష్టే సీఎం కేసీఆర్ సంకల్పం
సాగుకు అనుబంధంగా వృత్తిదారులకు చేయూత
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
భువనగిరి, నకిరేకల్ చెరువుల్లోకి చేప పిల్లల విడుదల
పెద్ద చెరువులో చేపపిల్లలు విడుదల
వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే గ్రామీణాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. భువనగిరి, నకిరేకల్‌లో బుధవారం ఆయన ఆరో విడుత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ బడుగుల, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి చెరువుల్లోకి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తులను బలోపేతం చేయడం ద్వారా వృత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని బయటకు తీసుకురావడానికి సులభతర మవుతుందని చెప్పారు.
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 8 : కుల వృత్తు ల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, అందుకోసం అనేక అభివృద్ధి, సంక్షే మ పథకాలను అమలు చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణ పరిధిలోని పెద్ద చెరువులో, నకిరేకల్‌లోని పెద్దచెరువులో మత్స్యకారులకు సర్కారు ఉచితంగా అందించిన చేపపిల్లలను ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన వదిలారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందించడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెలు పంపిణీ, రజక, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ మీటర్లు, గౌడ కులస్తులకు తాటిచెట్ల పన్నుమాఫీ, పాడి రైతులకు సబ్సిడీపై పశువులు, మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేస్తూ వృత్తిదారుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతున్నదని తెలిపారు. వరదలు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు.