యాదాద్రి క్షేత్రంలో పుణ్యస్నానాలకు శుద్ధ జలం
లక్ష్మీ పుష్కరిణిలో నీటి శుభ్రతకు ఫిల్టర్లు
స్పెయిన్ టెక్నాలజీ వినియోగం
గుండంలో 15 లక్షలలీటర్ల నీటి నిల్వ
1,500 మంది భక్తులు స్నానమాచరించేలా వసతులు ట్రయల్ రన్ సక్సెస్
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మితమవుతున్న కట్టడాలు భక్తులను ఆకట్టుకోవడంతో పాటు సౌకర్యవంతంగా ఉన్నాయి. భక్తులు పవిత్ర స్నానమాచరించేలా యాదాద్రి కొండ కింద గండిచెరువు వద్ద నిర్మితమవుతున్న లక్ష్మీ పుష్కరిణి గుండంలో 15లక్షల లీటర్ల శుద్ధి జలాలను నిల్వ చేశారు. ప్రత్యేక ఫిల్టర్లు ఏర్పాటు చేసి బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు.
యాదాద్రీశుడిని దర్శించుకునే భక్తులు తలనీలాలు సమర్పించి పవిత్ర గుండంలో స్నానమాచరించడం అనవాయితీ. గతంలో కొండపైనే ఉన్న గుండంలోకి కొండ కింద నుంచి నీటిని విడుదల చేసేవారు. భక్తుల రద్దీతోపాటు చెత్త ఎక్కువైనప్పుడు మాత్రమే నీటిని తీసివేసి, తిరిగి నిల్వ చేసేవారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కొండకింద గండిచెరువు వద్ద లక్ష్మీ పుష్కరిణి నిర్మించారు. 43మీటర్ల పొడవు, 16.50మీటర్ల వెడల్పు, 4 ఫీట్ల ఎత్తులో నిర్మించిన గుండంలో 15లక్షల లీటర్ల నీటిని నిల్వ చేశారు. ఏకకాలంలో 1,500 మంది భక్తులు స్నానమాచరించే విధంగా రూ.11.55 కోట్లతో 2.47 ఎకరాల్లో పుష్కరిణిని నిర్మించి చుట్టూ భక్తులు వెళ్లేందుకు అనుగుణంగా స్టీల్ గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు మండపాలను విభజిస్తూ స్టీల్ గ్రిల్స్, భక్తులు స్నానానికి వెళ్లడానికి, తిరిగి రావడానికి వీలుగా ప్రత్యేకంగా గ్రిల్స్‌ను బిగించారు. స్నానమాచరించిన అనంతరం బట్టలు మార్చుకునేందుకు మహిళలు, పురుషులకు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ రూమ్‌లు, మరుగుదొడ్లను నిర్మించారు. ఈ భవనాన్ని 59 మీటర్ల వెడల్పు, 66 మీటర్ల పొడవుతో నిర్మించారు.
స్పెయిన్ టెక్నాలజీ..
యాదాద్రి ప్రధానాలయం ప్రారంభమైతే భక్తుల రద్దీ మరింతగా పెరుగనుంది. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరికీ అసౌకర్యం కలుగవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దాంతో పుష్కరిణిలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవిధంగా స్పెయిన్ దేశం నుంచి 4 ఫిల్టర్లను దిగుమతి చేసుకున్నారు. పుష్కరిణి పక్కనే 20లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసేందుకు సంపును నిర్మించారు. సంపులో నుంచి పైపులైన్ ద్వారా 4 ఫిల్టర్లకు నీటిని విడుదల చేసి శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన నీళ్లను మోటారు పైపులైన్ల ద్వారా గుండంలోకి వదులుతారు. మెట్లు, మండపాలకు బిగించిన 300 నల్లాల ద్వారా నీళ్లు గుండంలో వెళ్తాయి. కల్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులంతా గుండంలో స్నానాలు చేస్తారు. దీంతో వెంట్రుకలు, చెత్త, ఇతర వ్యర్థాలతో పాటు మురుగు వచ్చి చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యర్థాలు డ్రెయిన్ ద్వారా తిరిగి బ్యాలెన్సింగ్ ట్యాంకులోకి వెళ్తాయి. వేరు చేసిన నీరు ఫిల్టర్లతో మరోసారి శుద్ధి చేసి తిరిగి గుండంలోకి పంపుతారు.
ట్రయల్ రన్ సక్సెస్..
లక్ష్మీ పుష్కరిణిని వైటీడీఏ అధికారులు బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈఎన్సీ గణపతిరెడ్డి, వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, కన్సల్టెంట్ మధుసూదన్ ట్రయల్న్ పరిశీలించారు. పైపులైన్, నీటిశుద్ధి యంత్రాలు, డ్రెయిన్, బ్యాలెన్సింగ్ ట్యాంక్, నీటి సంపులను పరిశీలించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా గుండంలో నీళ్లు నిల్వ కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.