భువనగిరి అర్బన్, అక్టోబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అన్ని రకాల రుణాలను సకాలంలో అందిస్తూ వారికి బాసటగా నిలుస్తూనే.. అభివృద్ధి బాటలో పయనిస్తున్నది భవనగిరి పీఏసీఎస్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి పూర్తిస్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వాటి ద్వారా మార్కెట్ ఆదాయాన్ని సైతం పెంచుకుంటున్నది.
పెరిగిన సభ్యుల సంఖ్య
భువనగిరి పీఏసీఎస్ కొత్త పాలకవర్గం ఫిబ్రవరి 15, 2020న ఏర్పాటవగా.. అప్పుడు 2,917 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం క్రమంగా సభ్యుల సంఖ్య పెరిగి 4,144 మందికి చేరుకున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆయా రైతులకు సకాలంలో రుణాలు అందిస్తున్నారు. వానకాలం సీజన్లో 110 మంది రైతులకు రూ.1.5 కోట్లు, యాసంగిలో 156 మంది రైతులకు రూ.కోటి రుణాలు అందించారు. 2020లో 96 వేలు ఉన్న బ్యాంకు డిపాజిట్లు ప్రస్తుతం రూ.1.20 కోట్లకు చేరాయి. రూ.41,37,000 ఉన్న సభ్యుల వాటాధనం ప్రస్తుతం రూ.74,24,000కు చేరుకుంది. ఇప్పటివరకు రూ.5.68 కోట్ల మేర స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందించారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా
2020 యాసంగిలో 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 700 మంది రైతుల వద్ద నుంచి 77.66 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వానకాలంలో 7 కొనుగోలు కేంద్రాల ద్వారా 400 మంది రైతుల నుంచి 28వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. దీంతో పీఏసీఎస్‌కు రూ.50లక్షల కమిషన్ రాగా బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. దీనికి తోడు రూ.40లక్షల విలువైన విత్తనాలు, రూ.1.39 కోట్ల విలువైన ఎరువులు విక్రయించడం ద్వారా పీఏసీఎస్‌ను రూ.58లక్షల 60వేల లాభాల్లోకి తీసుకొచ్చారు. దీనికి తోడు హుస్సేనాబాద్‌లో గల ఎకరం స్థలాన్ని ఎమ్మెల్యే సహకారంతో సొసైటీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకొని 500 మెట్రిక్ టన్నుల గోదాంను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్హాల్లో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో పీఏసీస్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. నష్టాల్లో ఉన్న సంఘాన్ని సంవత్సర కాలంలోనే లాభాల్లోకి తీసుకొచ్చాం. నవంబర్‌లో కొత్త గోదాం నిర్మాణ పనులు చేపట్టి వచ్చే సంవత్సరం నుంచి రైతులకు తక్కువ ధరలకు ఎరువులు, విత్తనాలు అందిస్తాం. వచ్చే నెల నుంచి విద్య, వాహనాలకు కూడా రుణాలను అందిస్తాం.
-నోముల పరమేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, భువనగిరి