
కొత్త విధానంతో సులువుగా పని
మున్సిపాలిటీల్లో తొలగిన ఇబ్బందులు
జిల్లాలో 606 దరఖాస్తులకు 512 అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టీఎస్-బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్)తో ఇంటి నిర్మాణ అనుమతులు సులభంగా వస్తున్నాయి. మున్సిపాలిటీల్లో ఇండ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకునే యజమానులకు 21 రోజుల్లోనే ఆన్లైన్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టడంతో పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. ఇక 75 నుంచి 200 చదరపు గజాల్లో జీ ప్లస్ ఇంటికి ప్లాన్ లేకుండా స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఒక్క రూపాయితోనే అనుమతిస్తున్నది. కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పడంతో ప్రజలకు ఎంతో ఉపయోగంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు 606 దరఖాస్తులు రాగా 512 అనుమతిచ్చారు. 38 తిరస్కరించగా 126 పెండింగ్‌లో ఉన్నాయి. భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 5 : మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతి ఇక సులువుగా లభించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-బీపాస్ ద్వారా ఈజీగా అనుమతి పొందే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ఇండ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకునే వారికి 21 రోజుల్లోనే అనుమతి రానున్నది.
అనుమతులు జారీ మున్సిపాలిటీల్లోని ఇండ్లు, వ్యాపార సముదాయాలు, ఇతర భవనాలు నిర్మించుకునే వారికి అనుమతి సులువుగా లభించేలా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-బీపాస్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఆన్లైన్లో స్వీయ ధ్రువీకరణ ద్వారా 21 రోజుల్లోనే అనుమతి ఇవ్వనున్నారు. 75 నుంచి 200 చదరపు గజాల్లో జీప్లస్ ఇంటికి స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఒక రూపాయితో అనుమతి ఇవ్వనున్నారు. 200 నుంచి 500 చదరపు గజాల వరకు జీ ప్లస్ టు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో పాటు స్వాధీన దృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఏరియా, స్థల విస్తీర్ణాన్ని బట్టి, మార్కెట్ విలువ ఆధారంగా మొదట సాధారణ ఫీజును, అనుమతి వచ్చాక 14 నుంచి 21 రోజులలోపు మిగతా ఫీజును చెల్లించి భవనాలు నిర్మించుకోవచ్చు. అయితే అనుమతులు వచ్చిన తర్వాత ఆరు నెలల్లోపు భవనాన్ని ప్రారంభించి రెండేళ్లలోపు దానిని పూర్తి చేయాల్సి ఉంటుంది.
భారీగా దరఖాస్తులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్ మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ ద్వారా అనుమతుల కోసం చాలా మంది దరదాఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 606 దరఖాస్తులు రాగా అందులో 512 ఇండ్లకు అనుమతి జారీ చేశారు. మరో 126 దరఖాస్తులు పరిశీలనలో ఉండగా సరైన పత్రాలు లేక పోవడంతో 38 దరఖాస్తులను తిరస్కరించారు.
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా
టీఎస్-బీపాస్ విధానంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధిస్తారు. సెల్ఫ్ సర్టిఫికేషన్‌లో ఇచ్చిన వివరాలతో ఇంటిని నిర్మిస్తే ఇబ్బందులు ఉండవు. అనుమతులు ఇచ్చిన తర్వాత మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. దరఖాస్తులో ఇచ్చిన వివరాలు, ధ్రువపత్రాల్లో ఇంటి నిర్మాణంలో తేడాలుంటే 25 శాతం జరిమానా విధిస్తారు. లేదా ముందస్తుగా సమాచారం ఇచ్చి నిర్మాణాన్ని కూల్చి వేసే అవకాశం ఉంది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
టీఎస్-బీపాస్ ద్వారా అనుమతి పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువపత్రాలను, ప్లాన్‌ను ఆన్లైన్ చేస్తే, అధికారులు పరిశీలించి 21 రోజుల్లో అనుమతి ఇస్తారు. ఈ విధానంతో ఇంటి యజమానుల పని సులువవుతున్నది. ఇంకా సందేహాలుంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలి.
ఎం.పూర్ణచందర్, మున్సిపల్ కమిషనర్, భువనగిరి
దరఖాస్తులు వచ్చిన వెంటనే పరిశీలిస్తున్నాం
టీఎస్-బీపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తున్నాం. సరైన పత్రాలు ఉంటే నిర్ణీత గడువుకు ముందే అనుమతులు జారీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 64 దరఖాస్తులు రాగా 57 అనుమతులు ఇచ్చాం. సరైన పత్రాలు లేని వాటిని తిరస్కరించాం.
-వై.సుదర్శన్, మున్సిపల్ కమిషనర్, భూదాన్‌పోచంపల్లి