యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడి దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణం సాఫీగా సాగేందుకు వైటీడీఏ అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రూ.63 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేకంగా రెండు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నది. కొండపైకి వెళ్లేందుకు ఒకటి, దర్శనం అనంతరం తిరిగి కిందికి చేరుకునేందుకు మరొకటి కడుతుండగా, పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొండపైకి వెళ్లే ఫ్లైఓవర్ వచ్చే ఏడాది జనవరి లోపు, కిందికి వచ్చే ఫ్లైఓవర్ నవంబర్‌లోపు పూర్తి చేయనున్నట్లు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు.
యాదాద్రి, అక్టోబర్4 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు గతంలో కేవలం రెండు ఘాట్‌రోడ్లు ఉండేవి. మొదటి ఘాట్‌రోడ్డు 7 మీటర్లు వెడల్పుతో ఉండేది. అనంతరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పదేళ్ల క్రితం మొదటి ఘాట్‌రోడ్డుకు కొద్ది ముందుకు యాదవనగర్ ఎదురుగా 12 మీటర్ల వెడల్పుతో రెండవ ఘాట్‌రోడ్డును నిర్మించారు. వెయ్యేండ్ల వరకు యాదాద్రి ఆలయం చెక్కు చెదరకుండా ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి కృష్ణశిలలతో ప్రధానాలయం పునర్నిర్మాణం చేపట్టారు. ఒక్కసారైనా యాదాద్రీశుడిని దర్శించుకువాలని యావత్ దేశంలోని భక్తులకు మదిలో కలిగేలా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మూల విరాట్ దర్శనం ప్రారంభంకాగానే భక్తుల తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. రోజుకు లక్ష మంది వచ్చినా తట్టుకునే విధంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకమైన రెండు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు.
ముమ్మరంగా..
యాదాద్రీశుడికి దర్శనానికి వచ్చే భక్తులు పునః దర్శనానికి ఆహ్వానించే విధంగా సకల వసతులు కల్పనలో వైటీడీఏ అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం కొండకు వెళ్లేందుకు ప్రత్యేకమైన రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ. 63 కోట్లతో రెండు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. కొండపైకి వెళ్లేందుకు, దర్శనం అనంతరం తిరిగి కొండకిందికి వచ్చేందుకు రెండు వేర్వేరుగా ఫ్లై ఓవర్లు నిర్మిస్తుండగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొండపైకి వెళ్లేందుకు కొండ కింద ఆర్యవైశ్య సత్రం నుంచి 12 మీటర్ల వెడల్పు, 445 మీటర్ల పొడవుతో మొదటి ఘాట్‌రోడ్డు నిత్యన్నదాన భవనం వరకు ఫ్లై ఓవర్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ను 7 పిల్లర్లతో నిర్మిస్తున్నారు. దర్శనం అనంతరం తిరిగి కొండ కిందకు వెళ్లేందుకు నిర్మించే ఫ్లై ఓవర్ ఉత్తరదిశలో సత్యనారాయణ వ్రత మండపం రింగురోడ్డు సర్కిల్ వద్ద ప్రారంభమై రెండో ఘాట్‌రోడ్డు మొదటి మలుపు దగ్గర అనుసంధానం చేస్తున్నారు. ఈ ఫైఓవర్ను 12 మీటర్ల వెడల్పు, 683 మీటర్ల పొడవు, 17 పిల్లర్లతో నిర్మిస్తున్నారు. ప్రధానాలయం ప్రారంభం అనంతరం పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీవీఐపీ, వీఐపీలు, ఇతర భక్తులకు ఇబ్బంది లేకుండా ఫైఓవర్ పనులు సాగుతున్నాయి.
నవంబర్‌లోపు కొండకిందికి వచ్చే ఫ్లైఓవర్..
యాదాద్రిని దర్శించుకుని కిందికి వచ్చేందుకు 683 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ను ఈ ఏడాది నవంబర్‌లోపు పూర్తి చేయనున్నట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు.. ప్రస్తుతం స్లాబ్ నిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటికే 12 మీటర్ల వెడల్పుతో నిర్మించిన రెండో ఘాట్‌రోడ్డుకు అనుసంధానం చేసే ప్రక్రియ నడుస్తున్నది.
జనవరిలోపు కొండపైకి వెళ్లే ఫ్లై ఓవర్ పూర్తి
యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వచ్చేడాది జనవరిలోగా భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు. మొదటి ఘాట్‌రోడ్డు ముందుగా భూ లక్ష్మీ లాడ్జి వద్ద రింగురోడ్డును దాటుతూ ఫ్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇక్కడి ఫ్లైఓవర్ మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉందని, అందుకు కొంతవరకు ఆలస్యం కావొచ్చని వారు తెలిపారు. దీంతోపాటు మొదటి ఘాట్‌రోడ్డు నిత్యాన్నదానం సత్రం వద్ద ఘాట్‌రోడ్డును మరింత వెడల్పు చేయాల్సి ఉంది.