యాదాద్రి, అక్టోబర్ 3 : యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి బాలాలయంలో ఆదివారం తెల్లవారు జాము మూడు గంటలకు ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. అర్చక స్వాములు నిజాభిషేకంతో నిత్య ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపించారు. సుప్రభాతం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి, శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు దీరారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో నిత్యకైంకర్యాలు అత్యంత వైభవంగా సాగాయి. స్వామివారి సేవలో భక్తులు పాల్గొని తరించారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ.16,58,864 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
యాదాద్రీశుడి సన్నిధిలో నారవేప
యాదాద్రి, అక్టోబర్ 3 : యాదాద్రీశుడితోపాటు అనుబంధ రామలింగేశ్వరుడి ఆలయాల్లో రెబ్బన ఫారెస్ట్‌కు చెందిన నారవేప కర్ర పూజలు అందుకోనున్నది. శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వయంభువుడి గర్భాలయం ఎదురుగా నిలిపే ధ్వజస్తంభానికి అమర్చే కర్రను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన ఫారెస్ట్ నుంచి తెప్పించారు. మూల విరాట్టు దృష్టి కోణానికి ఎదురుగా ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించనుండగా బలంగా ఉండే కొన్ని రకాలైన వృక్ష శాఖలను మాత్రమే అందుకు వినియోగిస్తారు. అందులో నారవేప వృక్షాలు ప్రధానమైనవని స్తపతి వివరించారు. ఈ వృక్షం కర్ర కొన్ని సంవత్సరాల పాటు బలంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాటు పలాస, మోదుగ, అశ్వత్థ, రావి, బిల్వ, మారేడు, బంధూకం, వేగిస, పనస, వకుళ, బొగడ్డ, అర్జున, మద్ది వృక్షాలను సైతం వినియోగిస్తారని చెప్పారు. మూల విరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజ స్తంభానికీ అంతే ప్రాధాన్యం ఇస్తారని స్తపతి వివరించారు. ధ్వజస్తంభానికి గత నెల 18న ఆలయ ఈఓ ఎన్. గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, స్తపతులు శుద్ధి పూజలు చేశారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 3,21,058
వీఐపీ దర్శనాలు 2,85,000
వేద ఆశీర్వచనం 5,160
సుప్రభాతం 200
క్యారీబ్యాగుల విక్రయం 5,000
వ్రత పూజలు 36,500
కల్యాణకట్ట టిక్కెట్లు 25,800
ప్రసాద విక్రయం 6,58,495
వాహన పూజలు 15,500
టోల్గేట్ 3,570
అన్నదాన విరాళం 25,410
సువర్ణ పుష్పార్చన 1,45,320
యాదరుషి నిలయం 69,620
పాతగుట్ట నుంచి 39, 175
ప్రచారశాఖ 840