
యాదాద్రిలో వైభవంగా పూజలు, వ్రతాలు
నేత్రపర్వంగా లక్ష పుష్పార్చన
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ
శ్రీవారి ఖజానాకు రూ.10,84,559ఆదాయం
శ్రావణ మాసం చివరి శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. యాదాద్రి దివ్యక్షేత్రం అపర వైకుంఠ శోభను సంతరించుకున్నది. ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. మరోవైపు స్వామివారికి అర్చకులు, వేద పండితులు
లక్షపుష్పార్చన జరిపించారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ యాదాద్రీశుడి సేవలో తరించారు.
యాదాద్రి, సెప్టెంబర్ 3 : పూజలు, వ్రతాలతో యాదాద్రి లక్ష్మీనరసింహుడి క్ష్రేతంలో శ్రావణ శోభ వెల్లివిరిసింది. ఉదయం 3గంటలకు సుప్రభాత సేవ నిర్వహించిన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. 8గంటలకు శ్రీ సుదర్శన హోమం, ఆ తర్వాత తిరుకల్యాణోత్సం జరిపించారు. శుక్రవారం వైష్ణవనామ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో, పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన జరిపించారు.
ఏకాదశి పర్వదినాన స్వామి వారికి లక్ష పుష్పాలతో అర్చనలు జరుపడం సంప్రదాయం. సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ, పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా కొనసాగింది.
నేడు యాదాద్రీశుడి దర్శనానికి బీసీ కమిషన్ రాక
యాదాద్రి, సెప్టెంబర్ 3: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు సీహెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కిశోర్‌గౌడ్ శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోనున్నారు. పదవీ బాధ్యలు చేపట్టిన అనంతరం తొలిసారిగా స్వామివారి దర్శనానికి వచ్చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు యాదాద్రికి చేరుకోనున్నారు.
ఇక అందరికీ వేద ఆశీర్వచనం..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వేద ఆశీర్వచనం సాధారణ భక్తులకు సైతం దక్కనుంది. గతంలో వీవీఐపీలకు మాత్రమే పరిమితమైన వేద ఆశీర్వచనం భక్తులకు సైతం అందించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ఈఓ ఎన్. గీత వేద ఆశీర్వచనం పూజను ప్రారంభించారు. రూ.516టికెట్ తీసుకునే భక్తులకు స్వామివారి బాలాలయ ముఖ మండపంలో వేద ఆశీర్వచనం అందజేయనున్నారు.
వైభవంగా వరలక్ష్మీ వ్రతం..
శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని వరలక్ష్మీ వ్రత మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కొండ కింద గోశాల వద్ద వ్రత మండపంలో జరిగిన మహోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలు అందించినట్లు ఈఓ ఎన్. గీత వెల్లడించారు.
యాదాద్రీశుడి సేవలో కేంద్ర మంత్రి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు స్వామివారి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, తహసీల్దార్ అశోక్‌రెడ్డి, పట్టణ సీఐ జానకీరెడ్డి ఉన్నారు.