యాదాద్రి, అక్టోబర్ 2 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం లక్ష పుష్పార్చన, పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభువు పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రిక్షేత్రంలో స్వామి వారికి లక్ష పుష్పాలతో అర్చన జరుపడం ఆలయ సంప్రదాయంగా వస్తుందని ఆలయ అర్చకులు నల్లందీగళ్ లక్ష్మీనారసింహాచార్యులు తెలిపారు. వేడుకల్లో ఆలయ ఏఈఓలు గజవెల్లి రమేశ్‌బాబు, గట్ట శ్రవణ్‌కుమార్, దేవస్థాన ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం పర్యవేక్షకులు పాల్గొన్నారు.
బారులుదీరిన భక్తులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిట లాడింది. పలు ప్రాంతాల నుంచి రావడంతో బాలాలయంలోని దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి పురవీధులు భక్తులతో సందడిగా మారింది. దర్శనాల అనంతరం లడ్డూ ప్రసాద విక్రయశాల వద్ద బారులుదీరారు. భక్తుల సందడితో కొండపైకి ఇతర వాహనాలను అనుమతించలేదు. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సు మా రు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. సాయంత్రం వేళ అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామివారికి జరిగిన పూజల్లో భక్తు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలు జరిగాయి. శ్రీవారి ఖజానాకు శనివారం రూ.13,47,331 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ జాయింట్ సెక్రటరీ చరణ్ జిత్‌సింగ్, డైరెక్టర్ ఆర్పీ సింగ్, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయ ముఖ మండపంలో అర్చకులు వారికి స్వామి వారి వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 2,91,318
రూ.100 దర్శనం టిక్కెట్ 28,000
వీఐపీ దర్శనాలు 2,25,000
వేద ఆశీర్వచనం 10,320
నిత్యకైంకర్యాలు 300
సుప్రభాతం 800
క్యారీబ్యాగుల విక్రయం 5,500
వ్రత పూజలు 46,000
కల్యాణకట్ట టిక్కెట్లు 25,800
ప్రసాద విక్రయం 4,29,740
వాహన పూజలు 11,600
టోల్గేట్ 2,220
అన్నదాన విరాళం 29,223
సువర్ణ పుష్పార్చన 1,08,200
యాదరుషి నిలయం 65,700
పాతగుట్ట నుంచి 19,110
ఇతర విభాగాలు 19,199