
ఊరూవాడ ఆత్మగౌరవ పతాక ఎగిరింది. జిల్లా కేంద్రాల నుంచి మూరుమూల పల్లెల వరకూ గులాబీ జెండా రెపరెపలాడింది. ఓ వైపు ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన… మరోవైపు క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టే శుభ సందర్భాన..టీఆర్ఎస్ జెండా పండుగ అంబరాన్నంటింది. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునందుకుని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఉత్సాహంగా కదం తొక్కాయి. కూడళ్లు, జెండా దిమ్మెలను అలంకరించి ఎక్కడికక్కడ టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. జై తెలంగాణ.., జై కేసీఆర్.. అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు తీశారు. శుక్రవారం నుంచి మొదలుకానున్న సంస్థాగత నిర్మాణానికి జెండా పండుగతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యనేతలు సందడి చేశారు. టీఆర్ఎస్ జెండా పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూ..వాడవాడల్లో గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. గురువారం జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచుకున్నారు. దీంతో గల్లీగల్లీల్లో టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. జెండా పండుగ రోజే పార్టీ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొన్నదని తెలిపారు. తిరుగులేని రాజకీయశక్తిగా టీఆర్ఎస్ నిలిచిందన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ ఒక్కరితో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ అంచలంచలుగా రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానానికి ఎదిగిందన్నారు. ప్రజల్లో మరింత విశ్వాసం కలిగిన పార్టీగా టీఆర్ఎస్ ఎదగడం సంతోషించదగ్గ విషయమన్నారు.