
యాదాద్రి, సెప్టెంబర్1: రాబోయే దసరా పండుగ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా 382 డబుల్ బెడ్ రూంల సామూహిక గృహ ప్రవేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్హులు తమతమ మండలాలలోని తహసీల్, మున్సిపాలిటీల్లో కమిషనర్ కార్యాలయంలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బుధవారం యాదగిరిగుట్ట పురపాలక సంఘం కార్యాలయంలో ఆమె మాట్లాడారు. దసరాలోపు యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు శుంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం స్థల సేకరణ నిమిత్తం కలెక్టర్ పమేల సత్పతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావుకు వినతి పత్రాలుఅందజేశామన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సైదాపురంలో 4 ఎకరాల భూమి కేటాయింపు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఆలేరు పట్టణంలో 64 డబుల్ బెడ్ రూంలు, కొలనుపాలకలో 64, యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో 40, మాసాయిపేటలో 40, ఆత్మకూరు(ఎం)లో 48, ఉప్పలపహాడ్‌లో 45, మోటకొండూర్‌లో 40, తుర్కపల్లిలో 40 డబుల్ బెడ్ రూం నిర్మాణాలు పూర్తయి చివరిదశ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. అక్టోబర్ 1వ తేదీలోపు పనులన్నీ పూర్తవుతాయని ధీమాను వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో జీ ప్లస్ 2తో ఇండ్ల నిర్మాణాలు జరుగుతాయని ఆమె వివరించారు. కామారెడ్డి జిల్లాలోని జంగంపల్లిలో డబుల్ బెడ్ రూంల నిర్మాణాలు మహాద్భుతంగా జరిగాయని, అదేతరహాలో యాదగిరిగుట్ట పట్టణంలో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపిన ప్రభుత్వ విప్ ఇప్పటికే గుత్తేదార్లతో మాట్లాడినట్లు తెలిపారు. ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. మొదటగా దివ్యాంగులకు, వితంతు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆ తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్ బూడిద సురేందర్, రైతుబంధు సమితి జిల్లా డైరక్టర్ మిట్ట వెంకటయ్య, కో ఆప్షన్ సభ్యులు గోర్ల పద్మ, ఎండీ రిజ్వానా, మార్కెట్ కమిటీ డైరక్టర్ బూడిద అయిలయ్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కసావు శ్రీనివాస్, ఆవుల సాయి తదితరులు పాల్గొన్నారు.