
రాజాపేట, ఆగస్టు 31 : మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు యువతుల్లో ఒక యువతి మృతదేహం లభ్యం కాగా మరో యు తి కోసం మంగళవారం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మండలంలోని బొందుగులకు చెందిన యువతి హిమబిందు కోసం రెండవ రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెవెన్యూ అధికారులు, పోలీసులు, యువకులు, గ్రామస్తులు కలిసి ఘటన జరిగిన పాముకుంట దోసర వాగు నుంచి మొదలు కొని నెమిల రోడ్డ్యాం వరకు గాలించినా జాడతెలియరాలేదు. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట సీఐ నర్సయ్య, తహసీల్దార్ జయమ్మ, సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన యువతి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. యువతి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల్లో యువకులు పాల్గొనాలని డీసీపీ కోరారు. గల్లంతైన యువతి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. కాగా ఎంపీడీవో రామరాజు, సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి యువకులు కూడా వరద నీటిలో యువతి జాడకోసం గాలించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సీఐ యోగేశ్కుమార్వర్మ, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, పోలీస్, రెవెన్యూ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
బిక్కేరువాగుపై రాకపోకలు నిషేధం
ఆలేరు రూరల్, ఆగస్టు 31 : ఆలేరు-గొలనుకొండల మధ్య బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలను నిషేధిస్తున్నామని తహసీల్దార్ గణేశ్‌నాయక్ పేర్కొన్నారు. వాగుపై ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ముందస్తుగా పోలీసు, రెవెన్యూ గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి రోడ్డుకు ఇరువైపులా కంప చెట్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ఉధృతి తగ్గే వరకు నిషేధం కొనసాగుతుందన్నారు.