
యాదాద్రి, సెప్టెంబర్16 : యాదాద్రి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన శివాలయంలో చివరి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్‌లోగా పూర్తి చేసేదిశగా వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానాలయంలో ఇత్తడి, స్టీల్ క్యూలైన్లు, విద్యుదీపాలంకరణ, గార్డెనింగ్, మొక్కలు నాటే పనులను అధికారులు గురువారం చేపట్టారు. శివాలయం ప్రధానాలయం ముఖమండపానికి ఇరువైపులా ఢిల్లీలో ప్రత్యేకంగా తయారు చేసిన ఇత్తడి గ్రిల్స్ బిగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. వీటితోపాటు ప్రధానాలయం తూర్పు పంచతల రాజగోపురం నుంచి స్వామివారి గర్భాలయం వరకు క్యూలైన్ల బిగింపు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవాలయాల్లో క్యూలైన్లను బిగించిన శ్రీకాళహస్తికి చెందిన ముణిచంద్రారెడ్డికి అప్పగించారు. దీంతోపాటు శివాలయంలోని తూర్పు ప్రధాన ద్వారం నుంచి ఆలయ తిరువీధుల్లో గల ప్రాకారం గుండా భక్తులు ప్రధానాలయ స్పటిక లింగాన్ని దర్శించుకుని ఉత్తర భాగం ద్వారం నుంచి బయటకు వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్న స్టీల్ క్యూలైన్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయంలో మొత్తం సుమారు 500 అడుగుల మేర స్టీల్ క్యూలైన్లను బిగించనున్నారు.
పూజ కోసం నందివర్ధనం, హెగ్జోరా మొక్కలు
ప్రధానాలయ ఉత్తర ప్రహరీకి పక్కన దేవుడి పూజకు వినియోగించే పూల కోసం మినీ నందివర్ధనం మొక్కలను నాటుతున్నారు. ఇవి సంవత్సరం పొడవునా పూస్తాయి. తెలుపు రంగుతో కూడిన పూలను చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా రోజంతా తాజాగా ఉంటాయి. ఇవి వర్షాకాలం, ఎండకాలంలో ఎక్కువగా పూస్తాయని వైటీడీఏ అధికారులు తెలిపారు. వీటితోపాటు హెగ్జోరా మొక్కలను సైతం నాటుతున్నారు. సుమారు 100 మీటర్లలో 3,500 మొక్కలను నాటేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు ప్రధానాలయం ఉత్తర దిక్కున ఉన్న పంచతల రాజగోపురం ఎదురుగా ప్రహరీకి సుమారు 6 మీటర్ల ఎత్తులో లోహపు విద్యుత్ స్తంభాన్ని బిగించారు. ఈ స్తంభానికి 6 బంగారు వర్ణపు విద్యుదీపాలను బిగించి రాజగోపురంపై స్వర్ణ వర్ణపు కాం తులు పడేవిధంగా అమర్చనున్నారు.