
నర్సంపేట, జనవరి 13: స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, పంటలకు 50 శాతం మద్దతు ధరలను పెంచాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేట క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి మోదీకి ఘాటు లేఖను రాశారన్నారు. దీనిపై ప్రధాని నోరు విప్పాలని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర అందకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడం లేదని, వెంటనే అమలు చేయాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు 50 శాతం ధర పెంచితేనే రైతుల బతుకులు బాగుపడుతాయని ఏకాభిప్రాయంగా కేంద్రానికి సూచన చేశారు. 2008లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని టీఆర్ఎస్ తీర్మానం చేసిందని గుర్తుచేశారు.
ఎకరాకు 60 టోకెన్లు ఇవ్వాలి
ప్రతి ఎకరాలకు ఉచితంగా 60 టోకెన్లను రైతులకు అందించాలని ఎమ్మెల్యే పెద్ది కోరారు. రైతులు కూలీలను ఆహ్వానించి వారితో పని చేయించుకుని ఆ టోకెన్లను వారికి ఇచ్చేలా ఉంటే మంచిదని టీఆర్ఎస్ చెబుతున్నదని వివరించారు. ఇటీవల కాలంలో జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధారం చేయాలని తీర్మాన ప్రతిని పంపించినా ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. రైతులను చంపడం, అడిగిన వారిని జైలులో పెట్టడడం, తప్పుడు కేసులు బనాయించడం కేంద్ర ప్రభుత్వ నైజనమని విమర్శించారు. ఏడు దశాబ్దాల నుంచి ఎరువులపై ఇచ్చే సబ్సిడీని కుట్రపూరితంగా బీజేపీ ప్రభుత్వం తగ్గించిందని మండిపడ్డారు.
సబ్సిడీలు ఎత్తివేసే కుట్ర..
మూడు నెలల క్రితం ఎరువుల ధర పెంచిందని ఎమ్మెల్యే అన్నారు. పొటాష్ ఎరువు ధర రూ. 900 ఉంటే ఇప్పుడు రూ. 1700లకు చేరిందన్నారు. 20-20 ఎరువు ధరను కూడా కేంద్రం యాభై శాతం పెంచిందన్నారు. క్రమేణా సబ్సిడీలను తగ్గిస్తున్నదని, వ్యయసాయ యంత్రాలపై కూడా రెండేళ్ల నుంచి 50 శాతం ధరలు పెంచిందని వెల్లడించారు. చుట్టుపక్కల రాష్ర్టాల్లో కేంద్రం డిస్కంలను చేజిక్కించుకుని రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించి విద్యుత్ పంపిణీని కేంద్రం తన చేతుల్లోకి తీసుకున్నదని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చే ఉచిత కరంటును ఎత్తేసే కుట్రను బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు.
మీటర్ల ఏర్పాటు సరికాదు..
మోటర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు బిగించాలని కేంద్రం నిర్ణయించడం సరికాదని పెద్ది అన్నారు. ఇలాంటి ఆలోచనలను ఉపసంహరించుకోకపోతే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రైతులను సమీకరించి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంగా పేరుపొందుతున్నదని తెలిపారు. సమావేశంలో నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, గుంటుక సోమయ్య, యువరాజు, గోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు.