ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో శుక్రవారం గోదాదేవి-శ్రీరంగనాథ స్వామి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. కల్యాణతంతును వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కమనీయంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం దేవతామూర్తులను ఊరేగించారు. ఈ కల్యాణతంతును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయం, సారంగాపూర్‌లోని కోదండ రామాలయం, నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల, ధర్మారం(బీ)లోని వీరబ్రహ్మేంద్ర స్వామి, డిచ్పల్లి మండల కేంద్రంలోని ఏడో బెటాలియన్ ఆవరణలో ఉన్న శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి, బోధన్‌లోని శ్రీవేంకటేశ్వరాలయం, ఆర్మూర్ పట్టణంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.