దేశంలోనే అతి పెద్ద వస్త్ర నగరిగా రూపుదిద్దుకోనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు చలివాగు రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగనుంది. ప్రతిరోజూ 12 మిలియన్ లీటర్ల నీరు పంపింగ్ జరిగేలా మిషన్ భగీరథ ఇంజినీర్లు ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. పంపింగ్ కోసం మూడు 230 హెచ్‌పీ మోటర్లతో పాటు 44 కి.మీ పొడవున 500ఎంఎం డయా పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. పార్కులో 2,500 కిలోలీటర్ల సామర్థ్యం గల సంప్ నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చించనున్నది. పాలనాపరమైన అనుమతులు కూడా రావడంతో పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. సోమవారం టెండర్ల ప్రైస్ బిడ్ తెరువనున్నారు.
వరంగల్, మే 8(నమస్తేతెలంగాణ) : గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,300 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ భారీ పెట్టుబడులతో వస్త్ర పరిశ్రమలు స్థాపించేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. గణేశ ఎకో స్పేర్ లిమిటెడ్ కంపెనీ ఇప్పటికే రెండు వస్త్ర పరిశ్రమలు నిర్మించింది. వీటిలో ఒకటైన గణేశ ఎకో టెక్ పరిశ్రమను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు శనివారం ప్రారంభించారు. ఆయన ప్రత్యేక చొరవతో కేరళ రాష్ర్టానికి చెందిన కిటెక్స్ కంపెనీ ఈ పార్కులో రూ.1,600 కోట్ల పెట్టుబడులతో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇక్కడ దీనికి కేటాయించిన 187 ఎకరాల్లో వస్త్ర పరిశ్రమల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు.
సౌత్‌కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్కులో 263 ఎకరాలు కేటాయించింది. వస్త్ర పరిశ్రమల నిర్మాణం జరిగే యంగ్వన్ కంపెనీ స్థలాన్ని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఇక్కడ 182 యూనిట్లు నెలకొల్పేందుకు సిద్ధమైన షోలాపూర్ ఎంఎస్ఎంఈకి ప్రభుత్వం 52 ఎకరాలు కేటాయించింది. రానున్న పద్దెనిమిది నెలల్లో ఈ పార్కులో సుమారు ఇరవై ఐదు యూనిట్లు పని చేస్తాయని, సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని శనివారం మెగా పార్కులో పర్యటించిన మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
కరోనా మహమ్మారితో పార్కులో కొంత ఆలస్యమైన వస్త్ర పరిశ్రమల నిర్మాణం ప్రస్తుతం ఊపందుకొంటున్న నేపథ్యంలో ఇక్కడ మౌలిక వసతులపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తొలి విడుత పరకాల సబ్ డివిజన్ మిషన్ భగీరథ గ్రిడ్ పైపులైన్ ద్వారా మెగా టెక్స్టైల్ పార్కుకు నీటి సరఫరా జరిగే పనులు చేపట్టి పూర్తి చేసింది. పార్కులో రెండు డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 0.586 మిలియన్ లీటర్ల నీటిని పైపులైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. గణేశ ఎకో స్పేర్ లిమిటెడ్ కంపెనీకి ఇది ఉపయోగపడుతుంది.
వస్త్ర పరిశ్రమల నిర్మాణంతో నీటి అవసరాలు పెరుగనున్న దృష్ట్యా మెగా పార్కుకు మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి వద్ద గల చలివాగు రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతలతో పైపులైన్ ద్వారా సరఫరాకు మిషన్ భగీరథ అధికారులు ప్రతిపాదించారు. ఇటీవల ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో రూ.100 కోట్లతో అంచనాలు రూపొందించారు.
పాలనాపరమైన అనుమతులు కూడా రావడంతో కొద్దిరోజుల క్రితం రూ.100 కోట్లతో టెండర్ల ప్రక్రియ చేపట్టారు. తుది దశకు చేరినందున పనులు దక్కించుకునే కాంట్రాక్టు సంస్థ అగ్రిమెంటు కుదుర్చుకుని త్వరలో పనులు చేపట్టే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ శనివారం మెగా పార్కులో రూ.100 కోట్ల మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. చలివాగు ప్రాజెక్టు జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఫలితంగా ఎత్తిపోతల ద్వారా గోదావరి నీరు చలివాగులోకి సరఫరా అవుతుంది.
మిషన్ భగీరథ ఇంజినీర్లు డిజైన్ చేసిన ప్రాజెక్టు ప్రకారం మెగా పార్కుకు నీటి సరఫరా కోసం చలివాగు వద్ద ప్రత్యేకంగా ఇంటేక్వెల్(పంపుహౌస్) నిర్మిస్తారు. ఇందులో ఎత్తిపోత కోసం మూడు మోటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో మోటరు కెపాసిటీ 230 హెచ్‌పీ. ఈ మూడింటిలో రెండింటి ద్వారా పంపింగ్ జరుగనుంది. ఒకటి స్టాండ్‌బై ఉండనుంది. ఈ మోటర్లు పనిచేసేందుకు ప్రత్యేక విద్యుత్ లైన్, సబ్ స్టేషన్ నిర్మాణం జరుగనుంది. చలివాగు రిజర్వాయర్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు ద్వారా శుద్ధి చేసిన నీటిని మెగా పార్కుకు పంపింగ్ చేసేందుకు 44కి.మీ పొడవున 500ఎంఎం డయాతో కూడిన పైపులైన్ నిర్మిస్తారు.
ఈ పైపులైన్ ద్వారా ప్రతిరోజూ 12 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తారు. ఈ నీటి నిల్వకు మెగా పార్కులో 2,500 కిలోలీటర్ల(ఒక కిలో లీటర్ 1,000 లీటర్లు) కెపాసిటీతో ఒక సంప్ నిర్మిస్తారు. ఈ సంప్ నుంచి పార్కులో మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతర్గత పైపులైన్ నిర్మాణం జరుగనుంది. టెండర్ ప్రక్రియ పూర్తికాగానే రూ.100 కోట్ల పనులు చేపట్టనున్నట్లు మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజినీర్(ఎస్ఈ) రాములు చెప్పారు.