కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తే.. టీఆర్ఎస్ త్యాగం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌ను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులకు గుండెల్లో దడ పుట్టిందన్నారు. ఆదివారం హనుమకొండలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలపై దాస్యం నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో అజంజాహి మిల్లు మూతపడితే టీడీపీ హయాంలో దాని ఆస్తులు అమ్ముకొని కార్మికుల పొట్టగొట్టారని ధ్వజమెత్తారు. అందుకే సీఎం కేసీఆర్ వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును కట్టిస్తున్నారని చెప్పారు.
హనుమకొండ, మే 8 : వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ నాయకుల గుండెల్లో దడ పుట్టిందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. యాభై ఏళ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తే.. ఎనిమిదేళ్లు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం త్యాగం చేసిందన్నారు. ఆదివారం హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.
శనివారం మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై చీఫ్ విప్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలోనే వరంగల్‌లోని అజంజాహి మిల్లు మూతపడడంతో వేల మంది చేనేత కార్మికులు రోడ్డున పడి, ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారన్నారు. మిల్లును మూసేసి కాంగ్రెస్ పార్టీ వారి కడుపు కొడితే, మిల్లు ఆస్తులను టీడీపీ అమ్ముకుందని చీఫ్ విప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసలను నివారించి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సీఎం కేసీఆర్ నిర్మించారన్నారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన వస్త్ర పరిశ్రమలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు చెప్పారు.
వరంగల్ ప్రాంతంలో పండించే పత్తి నాణ్యతతో ఉంటుందని, ఇక్కడి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. ఈ కంపెనీల ఏర్పాటుతో ప్రత్యక్షంగా 10వేల మందికి, పరోక్షంగా మరో 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్యాగాల పునాదులపై స్థాపించిందే టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు తమ పదవులను లెక్కచేయకుండా రాజీనామాలు చేశారన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, రైతును రాజు చేయాలనే సంకల్పం, అంబేద్కర్ స్ఫూర్తితో టీఆర్ఎస్ ముందుకు సాగుతున్న తరుణంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోల్పోతున్నాయన్నారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై అవి విమర్శలు చేస్తున్నాయని చీఫ్ విప్ మండిపడ్డారు. అమరుల కుటుంబాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అమరులైన ప్రతి కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇచ్చి, రూ.10లక్షలు అందజేసిందన్నారు. తొలి, మలి దశ ఉద్యమం సందర్భంగా కాంగ్రెస్ పాలనలోనే అనేకమంది అమరులయ్యారన్నారు.
నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీయేనని చెప్పారు. ప్రభుత్వ భూములు బలవంతంగా ప్రజల నుంచి తీసుకొని అమ్ముకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య, తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ పక్షాన్నే ప్రజలు నిలుస్తారన్నారు.
గత పాలనలో మూసివేసిన పరిశ్రమలు తెలంగాణ ప్రభుత్వం తెరిపించి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్‌రావు, సోదా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన జనం కూడా రాలేదన్నారు. మెగా టెక్స్టైల్ పార్కు పనులు పూర్తి చేసి, కంపెనీలు ఏర్పాటు చేస్తూ వరంగల్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే కాంగ్రెస్ మాట్లాడుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు.
దేశాన్ని, రాష్ర్టాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నదన్నారు. మంత్రి కేటీఆర్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. భూసేకరణ విషయంలో రైతులు సమ్మతి లేకుండా ఒక ఇంచు భూమి కూడా తీసుకోమన్నారు. కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారన్నారు. రైతులు ఈ విషయంలో ఇబ్బందులు పడొద్దని తప్పకుండా న్యాయపరంగానే భూసేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఎమ్మెల్యే సీతకకు కనిపించడం లేదా అని మేయ ర్ గుండు సుధారాణి ప్రశ్నించారు. తెలంగాణలో రాచరిక పాలన ఉంటే ఇక్కడ వేరే పార్టీలు ఉండేవా ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో వరంగల్‌కు ఒరిగిందేమీ లేదని, రాష్ట్రం ఏర్పాటయ్యాకే నగరం ఎంతో అభివృద్ధి సాధించిందని వివరించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని మేయర్ చెప్పారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అద్భుతమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. అజంజాహి మిల్లు మూసివేయడంతో వీధిన పడి, వలసలు వెళ్తున్న వారికి న్యాయం చేసేందుకే ఈ పార్కును సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. పార్లో కంపెనీలు ప్రారంభం కావడంతో కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తున్నారన్నారు.
రైతుల కోసమే పనిచేస్తే రాహుల్‌గాంధీ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక అసమర్థుడని ఆరోపించారు. ఓటుకు నోటులో జైలు పాలైన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, ఆయన ఒక బ్లాక్ మెయిలర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, కేసీఆర్‌లాంటి వ్యక్తి దేశ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
ఓటకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లితే, తెలంగాణ సాధన కోసం కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రైతుల భూములను బలవంతంగా లాక్కొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్నారు. సీతక్క, రేవంత్‌రెడ్డిలు ఇద్దరూ చంద్రబాబు తొత్తులేనని ఎద్దేవా చేశారు.
ములుగులో సీతక్క పోడు భూముల పేరుతో ఏమి చేస్తున్నారో అన్ని విషయాలు మాకు తెలుసన్నారు. త్వరలోనే వాటిని ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ సభను చిన్న మైదానంలో పెట్టి, సభ కిక్కిరిసి పోయిందనే ప్రచారం చేస్తున్నారన్నారు.