అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర సర్కారు తెచ్చిన ‘దళితబంధు’ ఆంక్షలు లేకుండా అమలవుతున్నది. పేద దళితుల కుటుంబాల్లో వెలుగులను ప్రసరింపజేస్తున్నది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన నందిపాట సమ్మయ్య, స్వర్ణ దంపతులకు రాష్ట్ర సర్కారు దళితబంధు పథకం వర్తింపజేయగా స్వర్ణ తల్లిగారి ఊరైన జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లిలో వారు సూపర్ మార్కెట్ యూనిట్‌ను శుక్రవారం ఏర్పాటు చేసుకున్నారు. కష్టంలో ఉన్న తమ కుటుంబాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నదని దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 29 (నమస్తేతెలంగాణ)
ఉపాధి మంత్రంతో దళితులను ఆర్థికంగా అభివృద్ధి బాట పట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధును ఆంక్షలు లేకుండా అమలు చేస్తున్నది. సాధారణంగా ఎలాంటి పథకాలకైనా ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. వారి మండలం, జిల్లా, బ్యాంకు సర్వీస్ ఏరియా పరిధిలోనే యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆంక్షలు అమలవుతుంటాయి. కానీ, దళిత బంధు యూనిట్లలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను కల్పించింది.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనుకూల ప్రాంతంలో యూనిట్ ఏర్పాటు చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా బాగు పడాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నది.ఈ వెసులుబాటుతో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన నందిపాట సమ్మయ్య, స్వర్ణ దంపతులు దళితబంధు పథకం కింద అందించిన రూ. 10లక్షలతో స్వర్ణ తల్లిగారి ఊరైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లిలో తాము ఎంపిక చేసుకున్న సూపర్ మార్కెట్ యూనిట్‌ను శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్నారు. మొట్లపల్లికి సమీపంలో సుమారు 10 గ్రామాల ప్రజలు నిత్యం మొట్లపల్లికి చెందిన వ్యాపారాలపై ఆధారపడి ఉంటారని, ఇక్కడ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఇక్కడ నెలకొల్పినట్లు సమ్మయ్య తెలిపాడు.
మాకు ఇద్దరు కొడుకులున్నరు. వాళ్లిద్దరు దివ్యాంగులు. వారి దవాఖాన ఖర్చుల కోసం మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు అమ్ముకొని వైద్యం చేయించిన. వాళ్లను ఇంటర్ దాక చదివిచ్చిన. పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో దళిత బంధు రూపంలో సీఎం కేసీఆర్ మమ్ముల్ని ఆదుకున్నడు. మా ఇంటిల్లిపాదికి ఉపాధి కల్పించి మా బతుకులకు దారిచూపిండు. మా కొడుకులు సూపర్ మార్కెట్ల కౌంటర్, అమ్ముడు చూసుకుంటరు. నాభార్య, నేను సరుకులు అందించే పనులు చూసుకుంటం.
ప్రభుత్వం ఇస్తున్న రూ.10లక్షల్లో మొదటి విడుత రూ.5లక్షలు వచ్చినయ్. గది అద్దెకు అడ్వాన్స్ కింద రూ.లక్ష కట్టిన. రూ.50వేలతోని షాపులో ఫర్నిచర్ తెచ్చుకున్న. మిగిలిన పైసలతోని సామాన్లు కొన్న. రెండో విడుత డబ్బుతో సామాన్లు మొత్తం తెచ్చి పెడుత. మేమే కూలీలం.. మేమే ఓనర్ల లెక్క పని చేసుకుంట షాపు నడుపుకొంటం.
– నందిపాట సమ్మయ్య, సూపర్ మార్కెట్ యజమాని, మొట్లపల్లి