నర్సంపేట, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఈయేడు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నది. అడవుల శాతం పెంపే లక్ష్యంగా ఏడేండ్లుగా కొనసాగుతున్న హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. వీటిని నాటి రక్షిస్తున్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న వాటిల్లో ఔషధ మొక్కలను కూడా భాగం చేస్తున్నారు. ఒక్కో ఇంటికి ఒక్కో మొక్కను పంపిణీ చేయనున్నారు. ఈ మధ్య జీపీ నర్సరీల్లో కొత్తగా కృష్ణతులసి, ఇన్సులిన్, వాటర్ ఆపిల్, లెమన్ గ్రాస్ తదితర మొక్కలను పెంచుతున్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇండ్లల్లో ఎక్కువగా ఈ మొక్కలను పెంచేలా చొరవ తీసుకుంటున్నారు.
ప్రస్తుతం దోమల బెడద తీవ్రంగా ఉంటున్నది. వీటి నివారణకు కృష్ణ తులసి మొక్కలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఇప్పటికే నర్సంపేట పట్టణంలో 15 వేలకు పైగా ఈ మొక్కలను నాటించారు. బీపీని అదుపులో ఉంచే గుణమున్న లెమన్ గ్రాస్నూ పెంచుతున్నారు. ఈ గడ్డిని ఎండబెట్టి వాడడం వల్ల బీపీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సారి కొత్తగా ఇన్సులిన్ మొక్కలను ఇంటింటికీ సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనిలో పుండ్లు, షుగర్, కిడ్నీలకు సంబంధించిన రోగాలను నయం ఉంటుంది. వాటర్ ఆపిల్ మొక్కలను అందించనున్నారు. నర్సంపేటలో మొత్తం మూడు నర్సరీల్లో 1.32 లక్షల పెంచుతుండగా, ఇంకా పట్టణానికి కావాల్సిన 36 వేల మొక్కలు అటవీ శాఖ నర్సరీల నుంచి తెప్పించనున్నారు.
నర్సంపేటను హరితవనంగా మార్చుతున్నాం. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారంలో మొక్కలను విరివిగా నాటిస్తున్నాం. గతంలో నర్సంపేటకు అవార్డు కూడా వచ్చింది. ఇంకా ప్రజలకు ఉపయోగపడే ఔషధ మొక్కలను కూడా నాటిస్తున్నాం. ఖర్చు ఎంతైనా మెడిసినల్ ప్లాంటు తెప్పించి నర్సరీల్లో పెంచి ఇంటింటికీ పంపిణీ చేయిస్తున్నాం. వేసవిలో మొక్కల రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.
– గుంటి రజినీకిషన్, మున్సిపల్ చైర్పర్సన్
ఔషధ మొక్కలతో ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పట్టణంలో పార్క్‌లు, డివైడర్లతో పాటు రోడ్ల వెంట, గ్రీన్ ల్యాండ్లలో మొక్కలను పెంచుతున్నాం. ఇంటికి ఔషధ, పూలు, పండ్ల మొక్కలు అందిస్తున్నాం. రోడ్ల వెంట నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నాం. గత హరితహారంలో నాటిన మొక్కల రక్షణకు నీరు, మందులు అందిస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్‌లో ఇంటింటికీ ఇచ్చే ఔషధ మొక్కలను కూడా నర్సంపేటలో పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే ఇచ్చిన వాటిని సంరక్షిస్తున్నాం.
– సంతోష్, ఎన్విరాన్మెంటల్ ఏఈ