
అల్పపీడన ప్రభావంతో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది. అన్నదాతలను ఆగమాగం చేసింది. జనగామ జిల్లాలో కొన్నిచోట్ల చేతికొచ్చిన వరిపంట దెబ్బతినగా, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యపు రాశులు తడిసిముద్దయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నీటి పాలవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కొంతమంది రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి కాపాడే ప్రయత్నం చేసినా వడ్ల గింజలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
అకాలవర్షంతో జనగామ జిల్లాలోని రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. ఉదయం నుంచి వాతావరణం మబ్బుగా ఉండి ముసురుతో జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం వరకు వాన తీవ్రరూపం దాల్చడంతో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిసిముద్దయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట కళ్ల ముందే నీటిపాలవడంతో రైతులు కంటతడిపెట్టారు. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లో జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు. జిల్లాలో 7.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జనగామ (వడ్లకొండ) 29.8మి.మీ, దేవరుప్పుల (కోలుకొండ) 27.8 మి.మీ, బచ్చన్నపేట 16.3 మి.మీ, జనగామ (అర్బన్) 15.0 మి.మీ, పాలకుర్తి 14.3 మి.మీ, నర్మెట 10.0 మి.మీ, తరిగొప్పుల 9.0 మి.మీ, తరిగొప్పుల (అబ్దుల్ నాగారం) 9.0 మి.మీ, పాలకుర్తి (గూడూరు) 7.3 మి.మీ, జఫర్గఢ్ 7.3 మి.మీ, చిల్పూరు (మల్కాపూర్) 3.5 మి.మీ, దేవరుప్పుల 2.3 మి.మీ, పాలకుర్తి (వావిలాల) 1.8 మి.మీ, ఘన్పూర్ స్టేషన్ 1.5 మి.మీ, రఘునాథపల్లి 1.0 మి.మీ, జఫర్గఢ్ (కూనూరు) 0.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని కాశీబుగ్గ, లేబర్కాలనీ, ఎనుమాముల, వర్ధన్నపేట మండలం, హనుమకొండ జిల్లాకేంద్రంలో పలుచోట్ల వర్షం కురిసింది. వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. మబ్బులు కమ్ముకోవడం, అక్కడక్కడా వర్షం కురవడంతో చేతికొచ్చిన వరిపంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందారు.