వనపర్తి, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : జాతి సమగ్రాభివృద్ధికి పునరంకితం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన వేడుకలకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావుతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధిలో వనపర్తి జిల్లా దూసుకుపోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. సాగునీటికి కొరత లేకుండా ప్రాజెక్టులు నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇప్పటికే రైతుబంధు ప్రపంచ దృష్టిని ఆకర్షించగా.. దళితబంధు కూడా ప్రపంచ ఖ్యాతి గడించడం ఖాయమని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దళిత వర్గాలు అభివృద్ధి చెందలేదని, వారి అభ్యున్నతిని కాంక్షించి సీఎం కేసీఆర్ దళిత సాధికారతను ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. జిల్లాలో 13,879 మంది రైతులకు రూ.47.92 కోట్లు రుణమాఫీ చేసినట్లు మంత్రి తెలిపారు. వానకాలం సీజన్లో 1,51,538 మంది రైతుల ఖాతాల్లో రూ.178.65 కోట్లు జమ చేసినట్లు స్పష్టం చేశారు. రూ.15.62 కోట్లతో 71 రైతు వేదికలను నిర్మించామన్నారు. రైతు బీమా కింద 29.35 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా కృషి చేశామన్నారు. భూసేకరణలో రూ.205 కోట్లు పరిహారంగా రైతులకు చెల్లించామన్నారు. ధరణితో భూ ప్రక్షాళన చేపట్టి 99.16 శాతం రైతులకు వివాద రహిత పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశామని చెప్పారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.24.26 కోట్లు అందజేసినట్లు వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.13.72 కోట్లు అందజేశామన్నారు. అర్హులందరికీ విడుతల వారీగా డబుల్బెడ్రూం ఇండ్లను అందజేస్తామన్నారు. చేనేత, జౌళి శాఖకు ప్రోత్సాహం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి సన్మానించారు. జిల్లాలో శాంతిభద్రతలు బాగున్నాయని, కొవిడ్ కాలంలో పోలీసుల పాత్ర గొప్పదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అంకిత్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.