వనపర్తి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): దేశంలోనే రెవెన్యూ వ్యవస్థలో భూప్రక్షాళన పేరుతో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ధరణితో భూములకు శాశ్వత రక్షణ కల్పించారన్నారు. ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని శుక్రవారం మంత్రి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ క్రయవిక్రయ లావాదేవీల సేవలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రారంభించిందన్నారు. రెవెన్యూశాఖలో భూప్రక్షాళన, ధరణి పోర్టల్‌తో నూతన శకం ఆరంభమైందన్నారు. గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగే రైతన్నకు ధరణి పోర్టల్‌తో క్షణాల్లో పని ముగించుకునే సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. ధరణి పోర్టల్‌లో కొన్ని సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయని, సాంకేతికతను అందిపుచ్చుకొని రానున్న రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ధరణిలో అందుబాటులో లేని ఆప్షన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లా మొత్తంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి సువిశాలమైన సొంతభవనం ఆత్మకూరులో ఏర్పాటుకావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతంగా మొదటి స్థానంలో వనపర్తి, రెండో స్థానంలో విశాఖపట్నం నిలిచిందన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో నష్టం కలిగిందని, ఇబ్బంది పడితే దరఖాస్తు చేసుకుంటే సమస్యలు పరిష్కరించ బడుతాయన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాసిల్దార్లకు ఇవ్వడం ద్వారా జాప్యం లేకుండా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి జరుగుతున్నాయన్నారు. మ్యుటేషన్ అయిన భూమిలో ఇంకెవ్వరూ వేలు పెట్టడానికి వీలుండదన్నారు. సాగునీరు పుష్కలంగా లభ్యమవుతున్నందున ఇక్కడ భూములకు విలువ పెరిగి లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ భద్రత, జాప్యం లేకుండా సేవలందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలే నేడు దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్‌చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, మండలాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లాల ప్రెసిడెంట్ నరేశ్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతోపాటు జిల్లా రిజిస్ట్రార్ రవీందర్, మహబూబ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ జహీర్, ఆడిట్ సబ్‌రిజిస్ట్రార్ సంపత్‌కుమార్, ఆత్మకూరు సబ్‌రిజిస్ట్రార్ అఫ్జల్ఖాన్, తాసిల్దార్ కడారి శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.