పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు
వనపర్తి రూరల్, ఆగస్టు22: వానకాలం ప్రారంభంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందునా ప్రభుత్వం గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణపై దృష్టి సారించింది. తాగునీటి వనరులు గ్రామ పంచాయతీల పర్యవేక్షణలో ఉన్నందున రక్షిత మంచినీటి నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే. తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేసేలా, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవడానికి అధికారులు క్లోరినేషన్‌కు సంబంధించిన సలహాలు, సూచనల చార్టులను కార్యదర్శులకు పంపారు. ఈ చార్టులను పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని డీపీవో సురేశ్‌కుమార్ ఆదేశించారు.
నీటి వనరుల నిర్వహణ ఇలా…
తాగునీటి ట్యాంకులను ప్రతి 15రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయాలి. ట్యాంక్ మూత ఎప్పుడూ మూసి ఉండాలి.
ట్యాంక్ శుభ్రం చేసిన తేదీని, శుభ్రం చేయాల్సిన తేదీని రాసి ఉంచాలి. ప్రతి వెయ్యి లీటర్ల నీటికి 5గ్రాముల చొప్పున బ్లీచింగ్ పౌడర్ కలపాలి.
బ్లీచింగ్ పౌడర్ 10లీటర్ల నీటిలో బాగా కలిపి 5నిమిషాల పాటు కదలకుండా ఉంచాలి. ఆ తరువాత బకెట్‌తో ట్యాంక్‌లో పోసి బాగా కలపాలి.
వాటర్ ట్యాంకులో బ్లీచింగ్ పౌడర్ కలిపిన 30నిమిషాల తరువాత మాత్రమే నీటిని వదలాలి. నీరు వదిలిన తరువాత గ్రామంలో చివరి నల్లా వద్ద క్లోరోస్కోప్ ద్వారా నీటిలో మిగిలి ఉన్న క్లోరిన్ పరీక్షిస్తే 0.2 పీపీఎం నుంచి 0.5 పీపీఎం మధ్య ఉండాలి.
బోరు బావి నుంచి వచ్చిన నీటిలో మాత్రమే బ్లీచింగ్ పౌడర్ కలపాలి. మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా వచ్చిన నీటికి బ్లీచింగ్ పౌడర్ కలపరాదు.
తాగునీరు సరఫరా చేసే పైపులైన్, గేట్ వాల్స్, లీకేజీలు ఉంటే తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. కనుక లీకేజీలు లేకుండా చూసుకోవాలి.
గ్రామాల్లో నల్లాలకు ఆన్,ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టాలి.