ఎడారి జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ సాగు లాభాలు ఆర్జించి పెడుతున్నది. కేవలం ఒక్కసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే.. 20 ఏండ్ల పాటు దిగుబడి వస్తుండడంతో కొందరు రైతులు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మూడో ఏడాది నుంచి ఎకరాకు సుమారు రూ.10 లక్షలు లాభం వస్తుంది. వనపర్తి జిల్లాలో గోపాల్పేట, పెబ్బేరు, వీపనగండ్ల మండలాల్లో సుమారుగా 13 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. చీడపీడల బెడద లేకపోవడంతోపాటు ఎరువుల అవసరం కూడా ఉండదు. లేత గులాబీ వర్ణంతో మిలమిలలాడే ఈ పండు అనేక పోషకాల గనిగా పేరొందింది. పండులోని ప్రతి భాగం ఆరోగ్యానికి మేలు చేస్తుండడంతో ప్రజలు ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు.
వనపర్తి, సెప్టెంబర్ 20 : ఆరోగ్య ప్రదాయిని డ్రాగన్ పండు సిరులు కురిపిస్తున్నది. సాగుచేసే రైతుకు సుదీర్ఘకాలం లాభాలు ఆర్జించి పెట్టడమే కాకుండా వినియోగదారుడికి పోషకాల గనిగా మారింది. అచ్చం గులాబీ పువ్వులాగే ఉండే ఈ పండుకు గులాబీ చెట్టు మాదిరిగానే ముళ్లు ఉంటాయి. అయితే పండులో ప్రతి భాగం ఉపయోగపడుతుంది. పండుపై రక్షణగా ఉండే పొర చర్మ సౌందర్యానికి ఉపయోగపడితే.. పండులోని గుజ్జు అనేక వ్యాధుల నివారిణిగా, ఆరోగ్యంగా ఉంచే పదార్థంగా ఉపయోగపడుతుంది. మన ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న ఈ పంటను అమెరికా, చైనా వంటి దేశాల్లో ఎక్కువగా పండిస్తుంటారు. ఒకప్పుడు అరుదుగా లభించే డ్రాగన్ ఫ్రూట్.. ప్రస్తుతం సూపర్మార్కెట్లల్లో ప్రజలకు అందుబాటులో లభిస్తున్నది. పంటకు ఒక్కసారే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే 20ఏండ్లపాటు ఎలాంటి పెట్టుబడి లేకుండా దిగుబడి సాధించవచ్చు. ఈ పంటను సాగు చేసిన మూడో సంవత్సరం నుంచి ఎకరాకు సంవత్సరానికి సుమారు రూ.10లక్షల లాభం వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ మూడు రంగుల్లో లభ్యమవుతుంది. ఈ ఫ్రూట్ చర్మం గులాబీ రంగుతోపాటు, లోపలిభాగంలో కూడా గులాబీ రంగులో ఉంటుంది. మరోరకం ఫ్రూట్ చర్మం గులాబీరంగులో ఉండి లోపలి పండు తెలుపురంగులో, ఇంకోరకం పండు చర్మం పసుపురంగులో ఉండి లోపలిపండు తెలుపురంగులో ఉంటుంది. ప్రస్తుతం చర్మంతోపాటు, పండు గులాబీ రంగులో ఉండే పంటను సాగు చేస్తున్నారు
పెరుగుతున్న డిమాండ్..
జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు డిమాండ్ పెరుగుతున్నది. ఇప్పటికే గోపాల్పేట మండలం ఏదుల గ్రామంలో మూడెకరాలు, పెబ్బేరు మండలం శాగాపూర్‌లో ఆరెకరాలు, వీపనగండ్ల మండలం తూముకుంటలో నాలుగెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులు పొలాన్ని డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూలంగా మారుస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో సాగు చేసిన పంటను పరిశీలించి మన ప్రాంతంలో కూడా పండుతుందని నిర్ధారణకు వచ్చిన రైతులు.. డ్రాగన్‌ఫ్రూట్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
ఎకరాకు రూ.5.50లక్షల ఖర్చు..
ఈ పంటను సాగు చేసేందుకు ఒకేసారి ఎకరాకు రూ.5.50లక్షల ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు. ఎడారి జాతికి చెందిన ఈ మొక్కలు మన ప్రాంతంలో కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. పొలంలో 10అడుగుల దూరంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి ఒక్కో స్తంభానికి 4 మొక్కలను వేశారు. ఈ మొక్కలు ఏపుగా పెరిగేవిధంగా రైతులు చర్యలు తీసుకున్నారు. ఎకరానికి 1800 మొక్కలు చొప్పున నాటారు. డ్రిప్ ఇరిగేషన్ పైపులతో మొక్కలకు ఆరుతడిగా నీటిని అందిస్తున్నారు. ఏడాదిన్నర తర్వాత మొక్కలకు పండ్లు కాస్తున్నాయి.
చీడపీడల బెడద నిల్..
ఎడారి జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ పంటకు చీడపీడల బెడద ఉండదు. అందువల్ల ఈ పంటను రైతులు ఇబ్బందులు లేకుండా సాగు చేసుకోవచ్చు. తెగుళ్లు, చీడపీడలు లేకపోవడంవల్ల ఎరువులు, రసాయనిక మందుల పిచికారీ చేయాల్సిన అవసరం ఉం డదు. ఇతర పంటల కంటే ఈ పంట లా భసాటిగా ఉంటుంది. ఎలాంటి నేలల్లోనైనా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు ముళ్లు ఉండటం వల్ల పశువులు, పక్షులు, కోతులు ఈ కాయలను ముట్టుకునే పరిస్థితి లేదు. సంవత్సరానికి కేవలం 6 నెలలు మాత్రమే కాయలు కాస్తాయి. మొక్కల సాలుకు మధ్య సుమారు 10 అడుగుల దూరం ఉండడంవల్ల అంతర్గత పంటలను సాగు చేసుకోవచ్చు.
ప్రయోజనాలు అనేకం..
డ్రాగన్‌ఫ్రూట్‌తో అనేక ప్రయోజనాలు ఉ న్నాయి. ఈ ఫ్రూట్లో పోషకాలు అధికంగా ఉండడంవల్ల ధర అధికంగా ఉంటుంది. ఈ ఫ్రూట్లో న్యూట్రిన్లు, విటమిన్లు, ప్రోటీన్లు ల భిస్తాయి. సీ విటమిన్, ఫైబర్, యాంటీయాక్సిడెంట్లు ఈ ఫ్రూట్లో అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రూట్‌లోని ఫెనోలిక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని మృధువుగా ఉంచడంతోపాటు శరీరంలోని రక్తప్రసరణకు ఉపయోగపడే ఐరన్శాతం అధికంగా ఉంటుంది. మధుమేహం నియంత్రణ, గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ఎంతో దోహదం చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడే మెగ్నీషియం ఇందులో ఎక్కువశాతం ఉంటుంది. ఈ ఫ్రూట్‌ను తినేందుకు ప్రజలు మక్కువ చూపుతారు.
మార్కెట్ చేసుకుంటే లాభాలు
డ్రాగన్ ఫ్రూట్‌కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ మన దేశంలో అవగాహన లేక మార్కెట్ సౌకర్యంలేదు. రైతులు సొంతంగా మార్కెట్ సౌకర్యం కల్పించుకుంటే భవిష్యత్తు ఉంటుంది. కిలో రూ.200వరకు విక్రయిస్తున్నాం. ఎకరాకు 5నుంచి 6టన్నుల దిగుబడి వస్తుంది. దీనివల్ల సంవత్సరానికి ఎకరాకు రూ.10లక్షలవరకు ఆదాయం వస్తుంది. ఎక్కువగా నీటి అవసరం కూడా ఉండదు. తెగుళ్ల బాధ ఉండదు. నాకున్న పొలంలో డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేశాను. గుంటూరు నుంచి విత్తనం తెప్పించి నాటాం. అవగాహన లేకుండా పంట వేయవద్దు.
రైతులను ప్రోత్సహిస్తున్నాం
ఉద్యాన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. డ్రాగన్ ఫ్రూట్‌పై ఆసక్తి చూపే రైతుల పెట్టుబడికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వనపర్తి జిల్లాలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ రకాల పంటలను ప్రోత్సహిస్తున్నాం.యంత్రాలు, పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. విదేశాల్లో పండే పండును మన రైతులు ఇక్కడ పండిస్తుండడం గొప్ప విషయం. వర్షాధార పంటలపై ఆధారపడే రైతులు.. ఇటువంటి పంటలపై మొగ్గు చూపితే ఆర్ధిక ప్రయోజనం కలుగుతున్నది. కూరగాయల తోటలు, ఇతర పంటలు సాగుచేసే రైతులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రత్యేక నిధులు అందించి ప్రోత్సహిస్తున్నాం.