తీరుతున్న చిల్లర సమస్య సర్వం డిజిటల్ మయమైంది. పట్టణం నుంచి పల్లెకు సాంకేతిక సేవలు విస్తరించాయి. కరోనా నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు జోరందుకున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా కొద్దిపాటి అక్షరజ్ఞానం కలిగిన వారంతా డిజిటల్కే మొగ్గు చూపుతున్నారు. చిన్న పంక్చర్ దుకాణం మొదలుకొని సూపర్ మార్కెట్ల వరకు గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం సేవలూ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. వ్యాపార సముదాయాల్లో చాలా వరకు క్యూఆర్ కోడ్ దర్శనమిస్తున్నది. దాదాపు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉండడంతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ డిజిటల్ సేవలను ప్రోత్సహిస్తున్నారు.ఎంత మొత్తం కొనుగోలు చేశామో.. అన్ని డబ్బులు మాత్రమే చెల్లిస్తుండటంతో చిల్లర సమస్య కూడా తీరింది.
పెబ్బేరు, ఆగస్టు 12 : గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. రోజు రోజుకూ ఆన్లైన్లో నగదు చెల్లింపులపై ఆసక్తి కనబరుస్తున్నారు. డిజిటల్ ఇండియా దిశగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీలు ప్రస్తుతం కరోనా కారణంగా జోరందుకున్నాయి. ప్రారంభంలో నగరాలకే పరిమితమైన డిజిటల్ సేవలు క్రమంగా గ్రామాలకూ విస్తరించాయి. టీ దుకాణం నుంచి మొదలుకొని ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ దర్శనమిస్తున్నది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ సాయంతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.ఉద్యోగులు, వ్యాపారులనే తేడా లేకుండా కొద్దిపాటి అక్షరజ్ఞానం ఉన్న వారంతా నగదు రహిత లావాదేవీలపై ఆసక్తి చూపుతున్నారు. దుకాణదారులు సైతం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన క్యూఆర్ కోడ్, వ్యాలెట్లను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా డిజిటల్ లావాదేవీల ద్వారా ఎంత కొనుగోలు చేశామో అంతే సొమ్మును చెల్లించే వీలుంటుంది. దీంతో చిల్లర సమస్య తీరుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలను అంతగా పట్టించుకోని ప్రజలు కరోనా కారణంగా డబ్బులు చెల్లించడం లేదు. దీంతో సాధారణంగా నగదు రహిత సేవలకు అలవాటుపడ్డారు. కరోనాకు ముందు 20 నుంచి 30 శాతం మంది డిజిటల్ చెల్లింపు చేస్తే.. ప్రస్తుతం వారి సంఖ్య 60 నుంచి 75 శాతానికి పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. నగదురహిత సేవలతో కలిగే ప్రయోజనాలను అధికారులు వివరిస్తున్నారు.డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకునే వారి సంఖ్య కూడా తగ్గిందని బ్యాంకు అధికారులు తెలిపారు.
ఏ దుకాణానికి వెళ్లినా కొ నుగోలు చేసే ముందే ఫోన్‌పే లేదా గూగుల్‌పే ఉందా అని అడుగుతా. షాపింగ్ పూర్తయ్యాక కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లిస్తాను. ఏటీఎంకు వెళ్లి నగదు తీసుకోవడం కంటే ఆన్లైన్ చెల్లింపే బెటర్. నోట్ల నుంచి కరోనా వస్తుందన్న భయం కూడా ఉండదు.
డిజిటల్ లావాదేవీలతో దుకాణాల్లో చిల్లర కష్టాలు తీరాయి. అంతకుముందు డబ్బులు ఇవ్వాలంటే సమ స్య ఉండేది. ప్రస్తుతం మా షాపు వద్ద చాలా మంది స్కానర్ల ద్వారా నగదు చెల్లిస్తున్నారు. కొనుగోలు చేసినంత చెల్లిస్తుండడంతో చిల్లర సమస్య తీరింది.