వనపర్తి, అక్టోబర్ 4 : టీఆర్ఎస్ సర్కార్‌కు మీ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, మహిళందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషాతో కలిసి మంత్రి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం వెనుక మానవీయ కోణం ఉంటుందన్నారు. ప్రజలందరూ ఆత్మాభిమానంతో జీవించాలన్నదే సర్కార్ లక్ష్యమని, డబ్బు ఉన్నోళ్ల ముందు పేదలు వెలవెలపోవద్దనే ఉద్దేశంతోనే చీరెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంత పేదరికం ఉన్నా.. పెండ్లి చేసిన ఆడపడుచులకు ఏడేండ్లు దాటకుండా సారె పెట్టడం తెలంగాణ సంస్కృతి… ఆ విధంగానే ఆడపడుచులకు ప్రభుత్వం తల్లిగారి కుటుంబంలా సారె పెడుతుందన్నారు. ప్రజలకు మేలు జరగాలన్నదే తమ అభిమతమని వివరించారు. వనపర్తి జిల్లాలో ఈ ఏడాది 1.64 లక్షల చీరెలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది వివిధ రకాల రంగులు, డిజైన్లలో చీరెలు ఉన్నాయన్నారు.కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి అత్తగారి ఇంటికి వెళ్లేటప్పుడు సంప్రదాయం ప్రకారంగా చీర, సారె పెట్టడం తమ సంప్రదాయమని, అందులో భాగంగానే బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, తాసిల్దార్ రాజేందర్‌గౌడ్, కౌన్సిలర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ..
జిల్లాకేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి మంత్రి హాజరయ్యారు. నియోజకవర్గంలోని బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిరంజన్‌రెడ్డి పంపిణీ చేశారు. అలాగే తన క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులు, వృద్ధులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్, నాయకులు పాల్గొన్నారు.